మార్చి నెల మొదలుకాక మునుపే రెండు తెలుగు రాష్ట్రాలలో ఉష్ణోగ్రతలు పెరగడం మొదలయ్యాయి. ఈసారి మే నెలలో ఉష్ణోగ్రతలు అత్యధికంగా 50 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రజ్ఞులు చెపుతున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా అప్పుడే రెండు తెలుగు రాష్ట్రాలలో ఫ్యాన్లు, ఏసీలు వాడకం పెరగడంతో క్రమంగా విద్యుత్ వినియోగం కూడా పెరగడం మొదలయింది. తెలంగాణాలో గత ఏడాది ఫిబ్రవరి నెలలో 4.6 కోట్లు యూనిట్లు విద్యుత్ వినియోగం రికార్డు కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో అది 4.8 కోట్లు యూనిట్లకి పెరిగిందని తెలంగాణా విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. గత ఏడాది మే నెలలో అది 5.3 కోట్లు యూనిట్లుగా ఉన్నట్లు తెలిపారు. ఈ ఏడాది మే నెలలో 5.8 కోట్లు యూనిట్ల విద్యుత్ వినియోగం ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
ఇటీవల తెలంగాణా రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న ఎన్నికలలో తెరాస మంత్రులు కొందరు తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగానే రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం నివారించగలిగామని, ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్ కోతలు లేవని అది తమ ప్రభుత్వ గొప్పదనమేనని చాలా గొప్పగా ప్రచారం చేసుకొంటున్నారు. అయితే రాష్ట్రంలో ఏర్పడిన విద్యుత్ సంక్షోభాన్ని అరికట్టేందుకు తెలంగాణా ప్రభుత్వం కొత్తగా కొన్ని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకి కృషి చేస్తున్నప్పటికీ అవన్నీ ఇంకా నిర్మాణదశలోనే ఉన్నాయి. అవి పూర్తి కావడానికి మరొక ఏడాదిన్నర సమయం పట్టవచ్చును.
కేంద్రప్రభుత్వం అందిస్తున్న నిరంతర విద్యుత్ సరఫరా పధకం వలన ఇంతవరకు ఎటువంటి విద్యుత్ కోతలు లేకుండా సాగిపోయింది. అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగితే అప్పుడు కేంద్రం మీద విద్యుత్ కోసం తీవ్ర ఒత్తిడి ఉంటుంది కనుక అది తెలంగాణా రాష్ట్రానికి అందిస్తున్న నిరంతర విద్యుత్ సరఫరాలో కోతలు విధిస్తే తెలంగాణాలో విద్యుత్ కోతలు మళ్ళీ మొదలయ్యే అవకాశం ఉంటుంది. అదే జరిగితే తెరాస ప్రభుత్వం నిరంతర విద్యుత్ అందిస్తోందని గొప్పలు చెప్పుకొంటున్న మంత్రులు సిగ్గుతో తలదించుకోవలసి వస్తుంది. కనుక కేంద్రం సరఫరా చేస్తున్న ఆ నిరంతర విద్యుత్ సరఫరా పధకంపై తెలంగాణా ప్రభుత్వం ఆధారపడకుండా ఈ ఏడాది పెరగనున్న విద్యుత్ వినియోగాన్ని తట్టుకొని కోతలు విధించకుండా నిరంతర విద్యుత్ సఫరా చేయగలిగితే వారి గౌరవం నిలబడుతుంది. పెరగనున్న విద్యుత్ అవసరాలకు తగ్గట్లుగా ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి విద్యుత్ సరఫరాకు తెలంగాణా ప్రభుత్వం చాలా ఏర్పాట్లు చేసుకొంది కనుక ఈ ఏడాది వేసవిలో విద్యుత్ కోతలు లేకుండానే గడిచిపోవచ్చును. ఒకవేళ మళ్ళీ విద్యుత్ కోతలు విధించినట్లయితే తెరాస ప్రభుత్వానికి అది అప్రదిష్టే అవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా విద్యుత్ వాడకం బాగానే పెరిగింది. కానీ తన అవసరాలకు మించి విద్యుత్ ఉత్పత్తి చేస్తూ ఇరుగు పొరుగు రాష్ట్రాలకు కూడా విద్యుత్ సరఫరా చేసే స్థితికి అది చేరుకొంది కనుక ఆ రాష్ట్రానికి ఈ విద్యుత్ సమస్యలు లేనట్లే భావించవచ్చును.