ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు లోడ్ రిలీఫ్ పేరుతో విధిస్తున్న కరెంట్ కోతలతో జనం రోడ్డెక్కుతున్నారు. ఎప్పుడు కరెంట్ పోతుందో తెలియని పరిస్థితి. విద్యుత్ డిమాండ్ ఉంటే… గృహ విద్యుత్ కు డిమాండ్ ఎక్కువగా ఉండే రాత్రి సమయాల్లో విచ్చలవిడిగా కరెంట్ తీస్తున్నారు. ఇక సాగుకు రోజుకు నాలుగు గంటలు కరెంట్ రావడం కూడా కష్టంగా మారింది. దీంతో ప్రజలు రోడ్డెక్కుతున్నారు. కానీ విద్యుత్ సంస్థలు మాత్రం లైట్ తీసుకున్నాయి. వీలైనంత వరకూ శక్తివంచన లేకుండా కరెంట్ ఇస్తున్నామని… చేయగలిగినంత చేస్తున్నామని చెబుతున్నారు.
రాష్ట్రం ఏర్పడిన కొత్తలో విద్యుత్ కొరత ఉండేది . చంద్రబాబు ప్రభుత్వం పూర్తి స్థాయిలో కసరత్తు జరిపి ఇరవై నాలుగు గంటల విద్యుత్ ఇవ్వడం ప్రారంభించారు. విద్యుత్ విషయంలో పూర్తి స్థాయిలో స్వయం సమృద్ధి చెందిన రాష్ట్రంగా ఏపీ మిగిలింది. అయితే అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి ఈగో సమస్యలతో మొత్తం కొలాప్స్ చేశారు. ఇప్పుడు ప్రతి ఏడాది కరెంట్ కోతలు కామన్ అవుతున్నాయి. ఇండస్ట్రీలు తరలి పోతున్నాయి. ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
అదే సమయంలో కరెంట్ చార్జీలు ఊహించనంతగా పెంచారు. దాదాపుగా రెట్టింపు అయ్యాయి. ట్రూ అప్ చార్జీలు, ఇంధర సర్ చార్జీల పేరుతో వరుసగా బాదేస్తున్నరు. ఇవెందుకంటే… కరెంట్ కోతలు లేకుండా బయట నుంచి విద్యుత్ కొన్న చార్జీలట. అంటే… ఇచ్చే అరకొరకూడా బయట నుంచి కొంటున్నారు. ఆ చార్జీల్ని ప్రజల నెత్తి మీదే వస్తున్నారు. ఓ చేతకాని పరిపాలనకు నిలువెత్తు సాక్ష్యంగా కనిపిస్తోంది. పొరుగు రాష్ట్రం తెలంగాణలో ఎలాంటి పరిస్థితుల్లోనూ కరెంట్ పోదు. నిజానికి ఉత్పత్తిలో తెలంగాణ కన్నా ఏపీకి ఎక్కువ. కానీ నిర్వహణ చేతకాక ఏపీ సర్కార్ చేతులెత్తేస్తోంది.
ఓ వైపు ఇలా ప్రజల్ని ఇక్కట్లలో పెట్టి… పాలకులు మాత్రం జల్సాలు చేస్తూంటారు. కానీ బయటకు ప్రచారం చేసుకునేది మాత్రం వేరే. కళ్ల ముందు కనిపిస్తున్నా… కరెంట్ తీయడం లేదనే చెబుతారు. ప్రజల్ని ఓ మాదరిగా చూడని ఈ ప్రభుత్వం తీరు విస్మయానికి గురి చేయకుండా ఎలా ఉంటుంది ?