ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ కొరత కారణంగా ప్రభుత్వం పెద్ద ఎత్తున బయట మార్కెట్ నుంచి కొనుగోలు చేసి ప్రజలకు సరఫరా చేస్తోంది. ఈ కారణంగా ప్రజలపై పెనుభారం పడేయాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటికే ఒక బిల్లులో మూడు రకాలైన భారాలను వసూలు చేస్తున్నారు. కొత్తగా రూ.7,200 కోట్లు వసూలు చేసేందుకు ఎపిఇఆర్‌సికి డిస్కమ్‌లు ప్రతిపాదనలు పంపాయి.. వాటిపై ప్రజాభిప్రాయసేకరణకు ఈసీ ప్రకటన జారీ చేసింది.
ఏపీ ప్రజలపై ఇప్పటికే ఓ ట్రూ అప్, రెండు ఇంధన సర్ చార్జీలను వడ్డించారు. ఇఆర్‌సి అనుమతించిన దాని కంటే అదనంగా విద్యుత్ కొనడం వల్ల ఈ ఖర్చును వసూలు చేయదలిచినట్లు ప్రతిపాదనల్లో పేర్కొన్నాయి. ఇపిడిసిఎల్ రూ.2,800 కోట్లు, ఎస్పిడిసిఎల్ రూ.2,500 కోట్లు, సిపిడిసిఎల్ రూ.1,900 కోట్లు చొప్పున ప్రతిపాదించాయి. వీటిపై విచారణ జరిపిన అనంతరం ఎంత భారం వేయాలనేది ఎపిఇఆర్సి నిర్ణయిస్తుంది. దీనికోసమే నోటిఫికేషన్ విడుదల చేశారు.
రాష్ట్రంలో మూడు డిస్కమ్‌ల పరిధిలో 1.91 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. అదనపు భారాలతో జనం గగ్గోలుఇప్పటికే విద్యుత్ బిల్లులు మోత మోగుతున్నాయని ప్రజలు గగ్గోలు పెడుతున్నా ప్రభుత్వం లెక్క చేయడం లేదు. డిస్కమ్‌లు రెండు ట్రూఅప్‌ల రూపంలో రూ.5,993 కోట్లను వసూలు చేస్తున్నాయి. వాడిన విద్యుత్‌తో పాటు అదనంగా ట్రూఅప్‌లు, ఇంధన సర్దుబాటు ఛార్జీలకే వినియోగదారులు 40 శాతం అదనంగా చెల్లించాల్సి వస్తోంది.
సీఎం జగన్ నాలుగున్నరేళ్ల కిందట ప్రమాణస్వీకారం చేసినప్పుడు కరెంట్ రేట్లు భారీగా తగ్గించేస్తానని ప్రకటించారు. తీరా చూస్తే.. ఇప్పుడు కరెంట్ బిల్లులు రెట్టింపు అయ్యాయన్న విమర్శలు వస్తున్నాయి. కరెంట్ ఉత్పత్తిపై దృష్టి పెట్టకుండా.. పీపీఏలు రద్దు చేయడం, బొగ్గు నిల్వలు సరిపడా ఉంచుకోకపోవడం తో కరెంట్ సమస్యలు వస్తున్నాయని అధిక రేటుకు బయట మార్కెట్ నుంచి కొనుగోలు చేస్తున్నారు. ఆ భారం అంతా.. మళ్లీ ప్రజలపైనే వేస్తున్నారు. చేతకాని పాలనకు ప్రజల్ని బాధ్యుల్ని చేస్తున్నారు.