మొన్న ఆర్టీసీ చార్జీలు.. నిన్న పెట్రో చార్జీలు… ఈ రోజు కరెంట్ చార్జీలు పెంచుతూ ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఆదాయానికి, ఖర్చుకు మధ్య పొంతన లేకపోవడంతో.. ఎంతో కొంత వసూలయినంత ప్రజల వద్ద నుంచే పిండే మార్గాలను ప్రభుత్వం అన్వేషిస్తోంది. ఈ క్రమంలో కరెంట్ చార్జీల భారం మోపింది. ఇప్పటికి.. ఐదు వందలపైన యూనిట్లు పైబడి వినియోగించేవారికి..ఈ చార్జీల పెంపు వర్తిస్తుంది. వివిధ శ్లాబ్‌ల ప్రకారం.. ఐదువందల యూనిట్లకుపైబడి వాడుకునేవారికి యూనిట్‌కు రూ. 9.05 పైసలు వసూలు చేస్తున్నారు. ఇప్పటి నుంచి అది రూ. 9.95 పైసలు అవుతుంది. అంటే.. ఒక్క యూనిట్‌కు 90 పైసలు పెంచినట్లయింది.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న విద్యుత్ మీటర్లలో 1.35 లక్షల లక్షల కనెక్షన్లలో.. ఐదు వందల యూనిటర్ల కన్నా ఎక్కువగా వినియోగం అవుతోంది. ఆ మేరకు.. వారందరిపై భారం పడుతుంది. వ్యాపార, పారిశ్రామిక సంస్థలకు ఈ భారం.. మరింత గండంగా మారనుంది. రాష్ట్ర విభజన తర్వాత మారిన పరిస్థితులతో… వ్యాపారాలు తగ్గిపోయాయని.. పారిశ్రామిక రంగం గగ్గోలు పెడుతోంది. ఇలాంటి సమయంలో.. చార్జీల పెంపు భారం వేయడంతో.. అవి మరింత కుంగిపోయే ప్రమాదం ఉంది. అదే సమయంలో.. ఈ భారం అంతా.. ఆయా సంస్థలు… ప్రజలపైనే అవకాశం ఉంది.
గత సర్కార్.. మిగులు విద్యుత్‌ను సాధించింది. ఇక భవిష్యత్‌లో విద్యుత్ చార్జీలు పెంచబోమని.. తగ్గించడానికి ప్రయత్నిస్తామని.. అప్పటి ముఖ్యమంత్రి పలుమార్లు ప్రకటించారు కూడా. అయితే కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత .. పీపీఏలను రద్దు చేసి.. వాటి నుండి కరెంట్ కొనుగోలు నిలిపివేసింది. అవసరమైనప్పుడు కర్ణాటకలోని ప్లాంట్ల నుంచి యూనిట్ రూ. 11కి కొనుగోలు చేస్తోంది. దీంతో… ఏపీలో కరెంట్ కష్టాలు ప్రారంభమయ్యాయి. చివరికి అది.. ప్రజలపై భారానికి దారి తీస్తోంది. త్వరలో మధ్యతరగతికీ చార్జీల వడ్డింపు ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది.