వర్షాకాలం… హైడల్ విద్యుత్ ప్రాజెక్టులన్నీ ఫుల్ స్వింగ్ మీద ఉన్నాయి. మిగులు ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో.. వద్దన్నా కరెంట్ ఇచ్చేంత పరిస్థితి ఉండాలి. కానీ ఇప్పుడేం జరుగుతోంది..? ఏపీలో కరెంట్ కోతలు. ఒకటి కాదు… రెండు కాదు.. నాలుగైదు గంటల పాటు… అదీ కూడా.. పీక్ అవర్స్‌లో కోతలు అమలవుతున్నాయి. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కూడా.. ఆశ్చర్యానికి గురి చేస్తోంది. గత ఐదేళ్ల కాలంలో.. ఎండా కాలంలో కూడా లేని కరెంట్ కోతలు.. ఇప్పుడు వర్షా కాలంలోనూ.. భారీగా అమలు చేయడం ఏమిటో వారికి అర్థం కావడం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు.. కోతల కష్టాలను ప్రజలు తీవ్ర స్థాయిలో అనుభవించారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే.. కరెంట్ కష్టాలు ప్రారంభమయ్యాయి.
ఏపీ సర్కార్.. విద్యుత్ రంగం వ్యవహారాలను సున్నితంగా పరిష్కరించుకోవడం మానేసి.. హెచ్చరికలు, బెదిరింపులకు దిగడంతోనే ఈ పరిస్థితి వచ్చిందన్న విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. సంప్రదాయేతర ఇంధన విద్యుత్ విభాగంలో… పవన, సౌర విద్యుత్ కంపెనీలను ఏపీ సర్కార్ రాచి పంపాన పెట్టింది. వారు కోర్టులకు, ట్రైబ్యూనళ్లకు పరుగులు పెట్టాల్సి వచ్చింది. ఈ క్రమంలో.. ఆయా సంస్థల నుంచి వస్తున్న విద్యుత్ దాదాపుగా ఆగిపోయిందని అంటున్నారు. అదే సమయంలో.. డిస్కంలు… విద్యుత్ పంపిణీ సంస్థలకు చెల్లించాల్సిన నిధులను కూడా.. నిలిపివేశారు. బిల్లులు చెల్లించకపోవడంతో… ఏపీ డిస్కంలకు విద్యుత్ అమ్మాకలను.. పవర్ ఎక్సేంజీలో నిలిపివేశారు. దీంతో.. ఏపీకి కరెంట్ అందడం గగనమైపోయింది.
నిజానికి ఏపీలో సర్కార్ మారినప్పటి నుండి విద్యుత్ విధానాన్ని… కేవలం డబ్బుల కోణంలోనే చూస్తున్నారు తప్ప.. ప్రజల విషయం ఆలోచించడం లేదు. కేంద్రం ఎన్ని సార్లు చెప్పినా.. లెక్క చేయడం లేదు. దాంతో ప్రజలకు విద్యుత్ కష్టాలు తప్పడంలేదు. ఓ సారి వ్యవస్థలో లోపాలు ప్రారంభమైన తర్వాత వాటిని సరిదిద్దుకోవడం అంత తేలికైన విషయం కాదు. ప్రభుత్వం.. ఈ విషయంలో ముందు జాగ్రత్తలు ప్రారంభించకపోతే.. ప్రజలు తిరుగుబాటు చేసే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఇసుక దొరకని వ్యవహారం ప్రజలపై ప్రత్యక్ష ప్రభావం చూపిస్తోంది. ఇప్పుడు కరెంట్ కోతలు కూడా.. తీవ్ర స్థాయిలో ఉంటే.. ప్రజాగ్రహాన్ని తట్టుకోవడం ఏ ప్రభుత్వానికైనా కష్టమవుతుంది.