ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత పది రోజులుగా నెలకొన్న కరెంటు కోతలు ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఎన్నికల ఫలితాలు వచ్చే రోజు వరకు పెద్దగా కరెంటు కోతలు లేని ఆంధ్రప్రదేశ్ లో హఠాత్తుగా గత పది రోజులుగా కరెంటు కోతలు ఉండడం ప్రజలని ఆశ్చర్యపరుస్తోంది. దీంతో ” రావాలి కరెంట్, కావాలి కరెంట్ ” అన్నట్టుగా పరిస్థితి తయారయిందని వైఎస్ఆర్సిపి వ్యతిరేకులు అంటున్నారు. వివరాల్లోకి వెళితే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేసవి తాపం ఇంకా తగ్గలేదు. ఒకవైపు ఎండలు ఇలా దంచేస్తుంటే , మరోవైపు కొత్తగా కరెంటు కోతలు జనాలని అసహనానికి గురి చేస్తున్నాయి. ప్రత్యేకించి కర్నూలు, చిత్తూరు, గుంటూరు, శ్రీకాకుళం లాంటి జిల్లాలో కరెంటు కోతలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ఫలితాలు అయ్యేదాకా లేని కరెంటు కోతలు హఠాత్తుగా ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి అనేదాని పై అధికారుల నుండి ఎటువంటి ప్రకటన రావడం లేదు. దీంతో సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు పుట్టుకొస్తున్నాయి.
ఏది ఏమైనా ఎన్నికల ముందు “రావాలి జగన్ కావాలి జగన్” అన్న స్లోగన్ ఎలాగైతే బలంగా వినిపించిందో, ఇప్పుడు అదే విధంగా ” రావాలి కరెంట్ కావాలి కరెంట్” అన్న స్లోగన్ ఆ జిల్లాల్లో బలంగా వినిపిస్తోంది.