కరెంట్ విషయంలో ఏపీ ప్రభుత్వం చేతులు ఎత్తేసినట్లుగా కనిపిస్తోంది. డిమాండ్ కు తగినంతగా విద్యుత్ లేకపోవడంతోనే కరెంట్ కోతలు విధిస్తున్నామని విద్యుత్ సంస్థలు ప్రకటించాయి. గత మూడు నాలుగు రోజులుగా ఏపీ గ్రామాల్లో అంధకారం అలుముకుంటోంది. ప్రజలు ఉక్కపోతకు గురవుతున్నారు. అన్నీ అనధికారిక కోతలే కావడంతో సోషల్ మీడియాలో గగ్గోలు రేగింది. మీడియాలోనూ రావడంతో ప్రభుత్వం వివరణ ఇచ్చింది.
గత ఏడాది కన్నా డిమాండ్ పెరిగిపోయిందని… కానీ ఉత్పత్తి మాత్రం పడిపోయిందని అందుకే విద్యుత్ కోతలు తప్పడం లేదని చెబుతోంది. గోదావరిలో వరద వచ్చినా విద్యుత్ ప్రాజెక్టులు పరిమితం. కృష్ణాలో వరద లేదు. దాంతో జల విద్యుత్ లేదు. పవన విద్యుత్ కూడా రావడం లేదు. ఇక బొగ్గు కొరత కారణంగా థర్మల్ విద్యుత్ పరిస్థితీ డొలాయమానంలో పడింది . అంతిమంగా ప్రభుత్వ చేతకానితనం వెలుగులోకి వచ్చింది. రాష్ట్రం చీకటిలోకి పోతోంది.
ఏపీలో ఇప్పుడు వాతావరణం భిన్నంగా ఉంది. ఎండలు మండిపోతున్నాయి. ఉక్క పోత పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కనీసం ఫ్యాన్ వేసుకోవడానికి కూడా అవకాశం లేకుండా చేస్తున్నారు. వర్షాకాలానికే ఇలా ఉంటే.. ఇక ముందు ముందు పరిస్థితి ఘోరంగా ఉంటుందని అంటున్నారు. బహిరంగ మార్కెట్ నుంచి కొనేందుకు ప్రభుత్వం డబ్బులు వెచ్చించినా వాటిని ప్రజల నుంచే వసూలు చేస్తున్నారు. ఇప్పటికే రెండు ఇంధన సర్దుబాటు చార్జీలు, ట్రా అప్ చార్జీలు వసూలు చేస్తున్నారు.
ప్రజలకు కోతలకు కోతలు .. కరెంట్ వాతలకు వాతలు… ఇక నుంచి రెగ్యులర్ గా ఉండే అవకాశం ఉంది.