నరేంద్ర మోడీ ప్రభుత్వ ఘనకార్యాల జాబితాలో మరొకటి నిజం కాదని తేలిపోయింది. దేశంలో 18 వేలకు పైగా గ్రామాలకు విద్యుత్ సదుపాయం లేదని వాటిని తక్షణం పూర్తి చేస్తామని ప్రధాని అధికారికంగా ప్రకటించారు. ఈ లెక్క వాస్తవానికి ఇంకా చాలా ఎక్కువగా వుంటుందని అధికారులు నిపుణులు వ్యాఖ్యానించారు. అతని కంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్టు ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ మరో అడుగు ముందుకేసి గత ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే ఇందులో సగం గ్రామాలకు విద్యుత్ సరఫరా పూర్తి చేశామని బడ్జెట్ ప్రసంగంలో ప్రవచించారు.
ప్రసిద్ధ పత్రిక ‘హిందూ’ ఈ విషయమై వాస్తవాలు తెలుసుకోవడానికి ప్రభుత్వ జాబితాలోని 345 గ్రామాలు పరిశీలించింది. అక్కడ నిజానికి ఏ విద్యుత్ సరఫరా లేదని తేల్చింది. అసలు గ్రామీణ విద్యుదీకరణ అంటే వీధి దీపాలు వుండి పదిశాతం ఇళ్లకు కరెంటు వుంటే చాలు. ఈ నిర్వచనమే లోపభూయిష్టమైతే ఈ మేరకు కూడా చేయకుండానే విద్యుదీకరణ విజయాల జాబితా ప్రకటించడం హాస్యాస్పదం. జరిగిన మేరకు కూడా ఈ సంవత్సరమే అని చెప్పలేమని 2014 ఎన్నికలకు ముందే ఆ ప్రక్రియ మొదలై వుండొచ్చని కీలక అధికారులు వ్యాఖ్యానించారు. కనుక కరెంటు కథలు మానుకుంటే మంచిది కదా!