మెగాస్టార్ అంటే చిరంజీవి. సూపర్ స్టార్ అంటే మహేష్ బాబు. పవర్ స్టార్ అంటే.. పవన్ కల్యాణ్. హీరోల పేర్ల ముందు బిరుదు ఉండడం చాలా కామన్. అది హీరోల పేర్లకు పర్యాయ పదంగా మారిపోయింది. పవన్ కల్యాణ్ ని ఆ పేరుతో కంటే పవర్ స్టార్ అని పిలుచుకోవడంలోనే అభిమానులకు మజా ఉంటుంది. దానికి తోడు… తెరపై పవర్ స్టార్ అంటూ… మెరుపులు చీల్చుకుంటూ అక్షరాలు పడుతున్నప్పుడే ఫ్యాన్స్ కి పూనకం మొదలైపోతుంది. అదీ.. అందులోని మ్యాజిక్. అయితే ఈ కిక్ ఇక మీదట కనిపించదు. ఎందుకంటే.. పవన్ కల్యాణ్ పేరు ముందు పవర్ స్టార్ అనే ట్యాగ్ లైన్ తీసేశారు.
`నా పేరు ముందు పవర్ స్టార్ అనే బిరుదు తగిలించొద్దు` అని పవన్ కల్యాణ్ దర్శక నిర్మాతలకు గట్టిగా చెప్పేశాడట. ఇక మీదట రాబోయే సినిమాల్లో కేవలం `పవన్ కల్యాణ్` అనే పేరు మాత్రమే ఉంటుంది. తోకలు కనిపించవు. భీమ్లా నాయక్ లోగో చూడండి. పవన్ కల్యాణ్ ఇన్ అండ్ యాజ్.. అని మాత్రమే ఉంటుంది. పవన్ పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన పాటలోనూ… `గాడ్ ఆఫ్ మాసెస్` అని కొత్తగా ఏదో పెట్టారు గానీ, పవన్ కల్యాణ్ అని లేదు. గాడ్ ఆఫ్ మాసెస్ అని పెట్టినందుకు సైతం పవన్ సీరియస్ అయ్యాడట. అసలు అలాంటి బిరుదులేం వద్దు అని క్లియర్ కట్ గా చెప్పేశాడట. ఫ్యాన్స్ కి కాస్త కష్టంగా ఉన్నా నిజంగా… ఇది మంచి మార్పే.