కర్ణాటక రైతులకు పనేం లేనట్లుగా తెలంగాణలో కాంగ్రెస్కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నట్లు కొంత మంది చేస్తున్న రాజకీయం వివాదాస్పదమవుతోంది. కర్ణాటకలో అసలు కరెంటే లేనట్లు… అంతకు కావాల్సినంత కరెంట్ ఉండేది.. కాంగ్రెస్ రాగానే కరెంట్ మొత్తం పోయినట్లుగా కొంత మంది రైతుల్ని తీసుకొచ్చి ప్రచారం చేయిస్తున్నారు. ఇక్కడ కూడా కాంగ్రెస్ ను నమ్మవద్దని ప్రచారం చేస్తున్నారు. దీనిపై మెదక్ జిల్లాలో తిరుగుతున్న రైతుల్ని కాంగ్రెస్ నేతలు అడ్డుకుంటే.. తాము రోజుకు మూడు వందల రూపాయల కూలికి వచ్చామని వారు చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు.
కర్ణాటకలో ఏదో జరిగిపోతోందన్న అభిప్రాయాన్ని కల్పించడానికి కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. అక్కడ కాంగ్రెస్ హామీలు అమలు చేయలేదని.. మోసం చేశారని.. ఇక్కడ కూడా అలాగే చేస్తారని అంటున్నారు. కేటీఆర్ కూడా రోజూ అదే చెబుతున్నారు. అయితే తెలంగాణలో ప్రచారానికి వచ్చిన డీకే శివకుమార్… దమ్ముంటే కర్ణాటక వచ్చి చూడాలన్నారు. కేటీఆర్ అంతకు ముందు మీట్ ది ప్రెస్ లో… కర్ణాటకలో పరిశీలిద్దామని సవాల్ చేశారు. ఇద్దరూ సవాళ్లను ఎంపిక చేసుకుని వెళ్తారో తెలియదు కానీ .. సవాళ్లు మాత్రం చేసుకుంటున్నారు.
కర్ణాటక ప్రభుత్వం ఆరు గ్యారంటీలు ఇచ్చింది. వాటిని అమలు చేస్తోంది. అయితే ప్రభుత్వం ఏర్పడిన నెల, రెండు నెలలకే హామీలు అమలు చేయలేదని విమర్శలు ప్రారంభించారు. అదే సమయంలో కరెంట్ కోతల విషయంలో కన్ని చోట్ల జరిగిన నిరసనల్ని రాష్ట్రం మొత్తం అన్వయించి ఇక్కడ ప్రచారానికి వాడుకుంటున్నారు. ఇవి ప్రజలపై ప్రభావం చూపిస్తాయో లేదో కానీ… కాంగ్రెస్ ను నమ్మవద్దని చెప్పడానికి కర్ణాటకను చూపిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు.