పవర్ స్టార్ హంగామా అయిపోయింది. ఈ సినిమాతో రావల్సిన రాబడి, పబ్లిసిటీ రెండూ వర్మకి వచ్చేశాయి. ఈ సినిమాని ఏటీటీలో ఎంత మంది చూశారు? ఎన్ని వసూళ్లు వచ్చాయి? అనే అంకెలు బయట పెట్టకపోయినప్పటికీ – ఆర్థికంగా ఈమధ్య వర్మ తీసిన ఏ సినిమాకీ రానంత రాబడి… ఈ సినిమాకి వచ్చిందన్నది మాత్రం నిజం. అందుకే ఇప్పుడు `పవర్ స్టార్` సీక్వెల్స్ పై దృష్టి పెట్టాడు వర్మ. పవర్ స్టార్ సిరీస్లో మరో రెండు సినిమాల్ని వదలబోతున్నాడట. పవర్ స్టార్ లో ఎన్నికల తరవాతి కథ చూపించాడు. పవర్ స్టార్ 2లో 2024 ఎన్నికల ముందు కథ చెప్పబోతున్నాడట. మరి 3లో ఎలాంటి కథ చెబుతాడో మరి..?
ఇవి కాక వర్మ నుంచి మరో అరడజను ప్రాజెక్టుల వరకూ రాబోతున్నాయి. ఇవి సినిమాలు కావు. షార్ట్ ఫిల్మ్స్ లాంటివి. ఎలాగూ తన దగ్గర డైరక్షన్ టీమ్ ఉంది. ఆన్ లైన్ లో సూచనలు, సలహాలూ ఇస్తుంటే, వర్మ సెట్ కి వెళ్లకుండానే పని జరిగిపోతోంది. తక్కువ శ్రమ – కావల్సినంత పబ్లిసిటీ – ఎక్కువ ఆదాయం. ఇదీ వర్మ పాటిస్తున్న సినీ సూత్రం. ఏటీటీ ఉన్నంత వరకూ, పబ్లిసిటీతో జనాల్ని ఆకట్టుకునేంత వరకూ, వర్మకి ఢోకా లేదు. అంతే!