ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి పిపిపి తరహాలో నిర్మించాలన్న నిర్ణయం మొదటి నుంచి విమర్శలకు గురవుతూనే వుంది. నేనైతే దీనిపై సవివరమైన వ్యాసాలే రాశాను. ఎందుకంటే ఏదో ఒక భవనానికో వంతెనతో లేక రహదారి నిర్మానానికో ఉపయోగించే పిపిపి నమూనాను మొత్తం ఒక నగరం అందులోనూ రాజధాని వంటి కీలక నగరం నిర్మాణానికి అన్వయించడం ఎక్కడా జరిగివుండదు.పేరుకు పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యం అన్నా ఆచరణలో అంతా ప్రైవేటు పెత్తనమేనని అందరికీ తెలుసు. వారికి రుణాలు ఇచ్చేది కూడా ప్రభుత్వ బ్యాంకులే. తమకు ఒకటికి పదిరెట్లు లాభాలు వస్తాయంటే ప్రైవేటు కంపెనీలు వస్తాయి గాని ముందే పెట్టుబడి పెట్టి నెత్తిన వేసుకోవు. అందుకే ప్రభుత్వం ఎంత హడావుడి చేసినా అమరావతిలో అడుగు పెద్దగా పడలేదు. కొన్ని ప్రాజెక్టులైతే దాదాపు రెండు మూడేళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. దాంతో ఇపిసి పిపిపి విధానాలు వదలిపెట్టి హైబ్రీడ్ అంటే మిశ్రమ విధానాన్ని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందట. పూర్తి పేరు హైబ్రీడ్ ఏన్యుటీ మోడల్(హామ్) దీంట్లో ప్రభుత్వం 40 శాతం వాటా కలిగివుండి దానికింద ఒకేసారి కాంట్రాక్టరుకు నగదు మొత్తం ఇచ్చేయాలి. మిగిలిన 60 శాతం మాత్రం వారు సమీకరించుకోవాలి. మొత్తంపైన 6 వేల కోట్ల విలువైన పనులను ఈ కొత్త పద్ధతిలో అప్పగించాలని భావిస్తున్నారు. అంటే ప్రభుత్వం ముందే నిధులిచ్చి, రుణాలు మంజూరు చేయించి పనులు అయ్యాక లాభాల్లో మాత్రం భారీ వాటా ఇస్తుందన్న మాట.బాగుంది కదా!