‘కల్కి’ హవా నడుస్తోంది. దేశమంతా ఈ సినిమా గురించే మాట్లాడుకొంటున్నారు. ప్రభాస్ స్టామినా ఏమిటో చాటి చెప్పిన సినిమా ఇది. ఈ సినిమాతో వైజయంతీ మూవీస్ జెండా మరోసారి రెపరెపలాడింది. అయితే ‘కల్కి’తో ప్రత్యక్షంగా, పరోక్షంగా లాభపడిన, పడబోతున్న సినిమాగా ‘రాజాసాబ్’ని చెప్పుకోవొచ్చు. ‘కల్కి’ తరవాత ప్రభాస్ నుంచి రాబోయే సినిమా ఇది. 2025 వేసవికి విడుదల అవుతుంది. `కల్కి`తో పోలిస్తే… బడ్జెట్ పరంగా ‘రాజాసాబ్’ చిన్న సైజులో కనిపించొచ్చు. కానీ.. ఒక్కసారి ‘కల్కి’ ఎఫెక్ట్ తో ‘రాజాసాబ్’ జాతకం మొత్తం మారిపోయింది.
‘రాజాసాబ్’ మార్కెట్ ని ‘కల్కి’తో పోల్చుకోలేం కానీ, ‘రాజాసాబ్’కు కూడా బాక్సాఫీసుని షేక్ చేసే సత్తా ఉంది. మారుతి దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇది. మారుతి కామెడీ టింజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘రాజాసాబ్‌లో’ ప్రభాస్ కామెడీ టైమింగ్ చూసే.. ఫ్యాన్స్ ‘అబ్బో..’ అనేసుకొన్నారు. మారుతికి అదే బలం కూడా. ‘భలే భలే మగాడివోయ్’, ‘మహానుభావుడు’ స్థాయిలో వెండి తెరపై ప్రభాస్ తో కామెడీ పండించగలిగితే – ‘రాజాసాబ్’ రిజల్ట్ కు ఇక తిరుగు ఉండదు. పైగా హీరోయిన్లతో ప్రభాస్ రొమాన్స్ చేసి, వాళ్లతో పాటలు పాడుకొని చాలాకాలం అయ్యింది. అవన్నీ దృష్టిలో ఉంచుకొని `రాజాసాబ్`లో ముగ్గురు హీరోయిన్లని రంగంలోకి దింపాడు మారుతి. ప్రభాస్ కామెడీ టైమింగ్, గ్లామరెస్ లుక్, హీరోయిన్లూ.. వీటితోనే సినిమాకు కొత్త కలరింగు వచ్చేసింది. ఈ తరహా పాత్రలో ప్రభాస్ ని చూసి ఏళ్లకు ఏళ్లు గడిచిపోయాయి. వాళ్లంతా మారుతి మ్యాజిక్‌లో పడిపోవడం అంత కష్టమేం కాదు. పైగా మారుతి ఈ సినిమాలో థ్రిల్, హారర్ ఎలిమెంట్స్ ని కూడా మిక్స్ చేశాడు. ప్రభాస్ నుంచి ఈ టైమ్‌లో, ఇలాంటి సినిమాని ఎవరూ ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. అందుకే కచ్చితంగా వాళ్లంతా థ్రిల్ కి గురి అయ్యే అవకాశం ఉంది. ఇలా ఏ కోణంలో చూసినా ‘కల్కి’ విజయం ‘రాజాసాబ్’కు వంద రెట్ల బలాన్ని ఇచ్చినట్టైంది.