విదేశాలకు పారిపోయి ఏడాదిన్నర అవుతోంది. అమెరికాలో గ్రీన్ కార్డు కూడా తీసుకున్నారని చెబుతున్నారు. అయితే ఇప్పుడు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు ట్యాపింగ్ కేసు నిందితుడు ప్రభాకర్ రావు. గతంలో కోర్టుకు ఆయన ఇచ్చిన హామీని మర్చిపోయారు. పరారీలో ఉన్నారని.. రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసి ఆయనను తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారన్న సమాచారం వెలుగులోకి రావడంతో ఆయన కంగారు పడుతున్నట్లుగా కనిపిస్తోంది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు.. తనకు 65 ఏళ్ల వయసు ఉందని అనారోగ్యంతో బాధపడుతున్నానని హైకోర్టులో పిటిషన్ వేశారు. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధాలు లేవని ఈ కేసులో పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు కాబట్టి తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసిన వ్యక్తికి ముందస్తు బెయిల్ ఇస్తారో లేదో కానీ ఇప్పుడెందుకు ఈ పిటిషన్ దాఖలు చేశారన్నది ఆసక్తికరంగా మారింది.
ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులను తీసుకు వచ్చిన వెంటనే కేసీఆర్, కేటీఆర్ లను అరెస్టు చేస్తామని రేవంత్ రెడ్డి బహిరంగంగా చెప్పారు. ఈ క్రమంలో వారిని తీసుకు వచ్చేందుకు సహకరించడం లేదని కూడా బీజేపీపై ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఆయనే ముందస్తు బెయిల్ ఇస్తే వస్తా అన్నట్లుగా పిటిషన్ వేయడంతో అంతర్గతంగా ఏదో జరుగుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.