రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎ1గా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సోమవారం యూఎస్ నుంచి వస్తారని, కేసులో అప్రూవర్‌గా మారుతారని లీకులిచ్చారు. అవన్ని ఒట్టి పుకార్లేనని పోలీసులు ఓ అంచనాకు వచ్చారు. ఆయన మనసు మార్చుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రభాకర్ రావు కొంత మంది పోలీసు ఉన్నతాధికారులకు ఫోన్ చేసి అప్రూవర్ గా మారుతానని బయటపడేయాలని కోరినట్లుగా ప్రచారం జరిగింది. రాజకీయ బాసులు చెప్పినట్లే చేశానని చెప్పి.. మొత్తం వారిపై నెట్టేసి బయటపడాలనుకున్నారు.
కానీ మళ్లీ ఏమయిందో కానీ ఆయన హఠాత్తుగా ఆగిపోయారు. అప్రూవర్ కాకుండా ఉన్నత స్థాయిలో ఆయనపై ఒత్తిడి ఉన్నట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతం ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నారు. క్యాన్సర్ చికిత్స అని చెబుతున్నారు కానీ.. పోలీసులు నమ్మడం లేదు. మరో మూడు నెలల పాటు అక్కడే ఉండాలని.. అప్పటి పరిస్థితుల్ని బట్టి నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. అదే విషయాన్ని రాష్ట్రంలోని పోలీసు ఉన్నతాధికారులకు తెలియజేసినట్లుగా తెలుస్తోంది.
ప్రభాకర్ రావు నివాసంలో పోలీసులు సోదాలు చేశారు. అయనను అదుపులోకి తీసుకుని విచారిస్తే గానీ సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఫొన్లు ట్యాపింగ్ చేసి ప్రైవేటు వ్యక్తులతో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్‌రావు బెదిరింపులు, దారుణాలకు ఒడిగట్టినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. అయితే రాజకీయ లింకులు బయటకు రావాలంటే.. ప్రభాకర్ రావు అత్యంత కీలకంగా భావిస్తున్నారు.