తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ అంశంలో ప్రభాకర్ రావే కీలకం. ఆయన పాత్రధారే అయినా… కీలక సూత్రధారులు ఎవరో ఆయనకే తెలుసు. ఆయన చెప్పే ప్రతి మాట ఇప్పుడు బీఆర్ఎస్ సుప్రీం లీడర్లకు వణుకే. అందుకే ప్రభాకర్ రావు అమెరికా నుండి వచ్చేస్తున్నారని, అప్రూవర్ గా మారారని వార్తలొచ్చాయి.
నిజానికి అమెరికా నుండి ప్రభాకర్ రావు నిన్న రాత్రికే హైదరాబాద్ చేరుకోవాల్సి ఉండగా… దుబాయ్ లోనే ఆగిపోయారని, అక్కడే ఉండి బీఆర్ఎస్ నేతలకు టచ్ లో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందుతోంది. ప్రభాకర్ రావు అప్రూవర్ గా మారకుండా బీఆర్ఎస్ నేతల ఒత్తిడి ఉందని… దుబాయ్ లో ఉండే బీఆర్ఎస్ నేతల అనుచరుల ఒత్తిడితోనే ఆయన అక్కడే ఆగిపోయారని పోలీసులు అనుమానిస్తున్నారు.
అంతేకాదు, దుబాయ్ లో ఉండి… ముందస్తు బెయిల్ ప్రయత్నాల్లో ప్రభాకర్ రావు ఉన్నారని నిఘా వర్గాల సమాచారం. ప్రభాకర్ రావు అప్రూవర్ గా మారితే బీఆర్ఎస్ పార్టీ పెద్దలపై కూడా టెలిగ్రాఫ్ యాక్ట్ కు అవకాశం ఉంటుందని… ఇది సీరియస్ కేసుగా మారబోతుందని, అందుకే ప్రభాకర్ రావుపై ఒత్తిడి తెస్తున్నట్లు ప్రభుత్వ పెద్దలు అనుమానిస్తున్నారు.
మరోవైపు తమ ఫోన్లు ట్యాప్ చేశారని… డైరెక్టుగా కేటీఆర్ పేరును ప్రస్తావిస్తూ కాంగ్రెస్ నేతలు ఫిర్యాదులు చేయటం, రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్టులోనూ ఆయన అన్ని విషయాలు ఒప్పుకోవటంతో… కేసు గత ప్రభుత్వ పెద్దల వరకు వెళ్తుందా అన్న అనుమానలు మొదలయ్యాయి. అందుకు ఊతం ఇచ్చేలా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చిట్ చాట్ చేస్తూ పెద్ద తలకాయల పేర్లు బయటకు రాబోతున్నాయని ప్రకటించారు.