మరికొన్ని గంటల్లో ‘బ్రాండ్ బాబు’ ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అవుతున్న కన్నడ హీరో సుమంత్ శైలేంద్ర కొంచెం టెన్షన్ పడుతున్నాడు. కథ, మాటలు, స్క్రీన్ ప్లే రాయడంతో పాటు చిత్రంలో ఒకటిన్నర సన్నివేశానికి (ఒక్క రోజులో) దర్శకత్వం వహించడంతో పాటు కర్త, కర్మ, క్రియ అన్నీ తానై వ్యవహరించిన మారుతికి మనసు లోపల ఏదో మూలన టెన్షన్ వుండి వుంటుంది. సినిమా హిట్టవుతుందా? లేదా? అని. కానీ, దర్శకుడు ‘ఈటీవీ’ ప్రభాకర్ అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సినిమా రిజల్ట్ ఏదైనా ఆయనకు పర్లేదు. ఎందుకంటే… ఈ సినిమా హిట్టయితేనే నెక్స్ట్ ఛాన్స్ వస్తుందనే టెన్షన్ ఆయనకు లేదు.
టీవీల్లో ఎన్నో హిట్ సీరియల్స్, షోలు దర్శకత్వం వహించిన ‘ఈటీవీ’ ప్రభాకర్ ‘నెక్స్ట్ నువ్వే’తో సినిమా దర్శకుడిగా మారారు. అది అనుకున్నట్టు ఆడలేదు. అయినా.. మారుతి అతడి ప్రతిభపై నమ్మకం వుంచాడు. అది ‘బ్రాండ్ బాబు’కి మాత్రమే పరిమితం కాలేదు. దీని తరువాత తన సంస్థలో మరో సినిమాకి దర్శకత్వం చేయాలని ఒప్పందం చేసుకున్నాడు. మారుతితో పాటు ‘నెక్స్ట్ నువ్వే’ నిర్మాతలల్లో ఒకరైన జ్ఞానవేల్ రాజా కూడా ప్రభాకర్ కి అడ్వాన్స్ ఇచ్చారట! “నా తదుపరి సినిమా మారుతి గారి సంస్థలో చేస్తానో.. జ్ఞానవేల్ రాజా గారి సంస్థలో చేస్తానో చెప్పలేను. ఇద్దరి సంస్థల్లోనూ ఒప్పందాలు జరిగాయి” అని ప్రభాకర్ పేర్కొన్నాడు. సో.. సినిమా రిజల్ట్ ఏదైనా ఆయన చేతిలో అవకాశాలు వున్నాయి. హిట్ అయితే హ్యాపీగా, లేదంటే కొంచెం ఇబ్బందిగా నెక్స్ట్ సినిమా చేయాలి. ‘బ్రాండ్ బాబు’కి బజ్ బాగుంది. సినిమా కూడా తప్పకుండా హిట్ అవుతుందని సినిమాకి పని చేసిన వాళ్లు చెప్తున్న మాట!