ప్రభాస్ `ఆదిపురుష్` పట్టాలెక్కడానికి రంగం సిద్ధం అవుతోంది. ప్రస్తుతం ప్రభాస్ ముంబైలోనే ఉన్నాడు. `ఆది పురుష్`కి సంబంధించిన ప్లానింగ్ లో దర్శకుడితో కలిసి తలమునకలై ఉన్నాడు. జనవరి నుంచి షూటింగ్ ప్రారంభించే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకూ సీత ఎవరన్నది తేలలేదు. ఈ చిత్రబృందం ముందు చాలా ఆప్షన్లు ఉన్నా, ఇప్పటి వరకూ ఎవరినీ ఫైనల్ చేయకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. కీర్తి సురేష్ పేరు ప్రముఖంగా వినిపిస్తున్నా, తనకంటే మంచి ఆప్షన్ని వెదికి పట్టాలని చిత్రబృందం భావిస్తోంది. బడ్జెట్ పరంగా ఎలాంటి పరిమితులూ లేకపోయినా, కాల్షీట్ల విషయంలో సమస్యలు సృష్టించని కథానాయిక అయితేనే బెటర్ అన్న భావనలో చిత్రబృందం ఉంది. దర్శకుడు ఓంరౌత్ దృష్టి బాలీవుడ్ భామపై ఉందని, సీతగా బాలీవుడ్ కథానాయినే సెట్ చేస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే.. కథానాయిక విషయంలో తుది నిర్ణయం ప్రభాస్ కే అప్పగించారని, ప్రభాస్ ముందు ఇప్పుడు నాలుగైదు ఆప్షన్లు ఉంచారని, తాను ఓకే అన్న కథానాయికే హీరోయిన్ అవుతుందని.. ముంబై మీడియా సైతం కథనాలు వండి వారుస్తోంది. ఓ వారం పది రోజుల్లో కథానాయిక ఎవరన్నది తేలిపోవడం ఖాయం. ఓ మంచి రోజు చూసుకుని, హీరోయిన్ పేరుని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.