విష్ణు తీస్తున్న ‘కన్నప్ప’ గురించి ప్రేక్షకులు ఆసక్తిగా మాట్లాడుకొంటున్నారంటే దానికి కారణం.. ఈ సినిమాలో ప్రభాస్ ఓ వేషం వేయడమే. ప్రభాస్ ని విష్ణు ఎలా ఒప్పించాడు? అసలు ఈ సినిమా ప్రభాస్ ఎందుకు చేస్తున్నాడన్నది ఇప్పటికీ మిలియన్ డాలర్ల ప్రశ్నే. ప్రభాస్ కోసమైనా ‘కన్నప్ప’ని చూడడానికి జనాలు థియేటర్లకు వస్తారన్నది విష్ణు ఆశ, ఆలోచన కావొచ్చు. ఏప్రిల్ 25న ఈ చిత్రం విడుదల అవుతోంది. ఇప్పుడు ‘కన్నప్ప’ నుంచి ప్రభాస్ లుక్‌ని రివీల్ చేశారు.
‘కన్నప్ప’లో ప్రభాస్ రుద్రగా కనిపించబోతున్నాడు. ఒత్తైన, పొడవాటి జుత్తు, మెళ్లో రుద్రాక్ష మాలలు, నుదుటన విభూతి, నల్లని వస్త్రాలు, భుజాన కాషాయ కండువాతో రుద్రగా ప్రభాస్ ఎంట్రీ ఇచ్చాడు. లుక్ జస్ట్ యావరేజ్. అంతే. పెద్దగా మాట్లాడుకోవడానికి ఏం లేదు. ఓరకంగా చూస్తే ఇదేమైనా ఏఐ సృష్టించిన విజువలా? అనికూడా అనిపిస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్ నటిస్తున్నప్పుడు, ప్రభాస్ తోనే ఓపెనింగ్స్ వస్తాయని విష్ణు అనుకొన్నప్పుడు ఆ పాత్రని చాలా ఆసక్తికరంగా డిజైన్ చేయాలి. లుక్ దగ్గర్నుంచి, దాన్ని రివీల్ చేయడం వరకూ అన్ని దశల్లోనూ ఓ స్పెషల్ ఎట్రాక్షన్ ఉండేలా చూసుకోవాలి. కానీ `రుద్ర`గా ప్రభాస్ ని చూస్తే అలాంటివేం అనిపించలేదు. ఓ చిన్న టీజర్ కట్ గా ఈ లుక్‌ని ఇంట్రడ్యూస్ చేసినా బాగుండేది. అదేం జరగలేదు. ఈ లుక్ చూసి ప్రభాస్ ఫ్యాన్స్ ధియేటర్లకు వెళ్తారా? అనేది కొత్త అనుమానం. ‘కన్నప్ప’ నుంచి ఇప్పటి వరకూ చాలా లుక్స్ బయటకు వచ్చాయి. అవేమీ టాక్ ఆఫ్ ది టౌన్ కాలేకపోయాయి. కనీసం ప్రభాస్ లుక్‌తో అయినా ఆ లోటు తీరుతుందనుకొంటే, అది కాస్త ఇలా తయారైంది.