దాదాపు మూడేళ్లు… ఒకే సినిమాకి కేటాయించాలంటే, అదీ.. తెలుగులో అసాధ్యమనే చెప్పాలి. పైగా.. మాస్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న హీరో చేయాల్సిన పని కాదిది. కానీ.. బాహుబలి కోసం ప్రభాస్ ఈ త్యాగం చేసేశాడు. ఇప్పుడు మరో యేడాది బాహుబలి 2 కోసం అర్పిస్తున్నాడు. అంటే తన కెరీర్లో కీలకమైన నాలుగేళ్లు ఒక ప్రాజెక్టు కోసం అర్పించాడన్నమాట. బాహుబలి 2.. వచ్చే యేడాది విడుదల కాబోతోంది. అంటే… అప్పటి వరకూ ప్రభాస్ ని వెండి తెరపై చూళ్లేం. మధ్యలో ప్రభాస్ ఓ సినిమా చేస్తాడన్న పుకార్లు వచ్చినా అవన్నీ ఊహాగానాలుగా మారిపోయాయి. అయితే బాహుబలి 2 విషయంలో ప్రభాస్ తొందరపెడుతున్నాడన్నది లేటెస్ట్ టాక్.
వీలైనంత త్వరగా బాహుబలి షూటింగ్‌ని ముగించాలని రాజమౌళికి చెప్పేశాడట ప్రభాస్. కనీసం తన పార్ట్ అయినా త్వరగా పూర్తి చేయమని అభ్యర్థిస్తున్నాడట. నిజానికి ప్రభాస్ తో సన్నివేశాలన్నీ జూన్ నాటికి పూర్తి చేయాలని రాజమౌళి ముందే ప్లాన్ చేశారు. కానీ… అది కాస్త లేట్ అయ్యే అవకాశాలున్నాయి. ఈ ప్రాజెక్టు నుంచి బయటపడితే… మిగిలిన సినిమాల్ని చకచక పూర్తి చేయొచ్చని 2017లో తన వంతుగా ఓ రెండు సినిమాలైనా బయటకు తీసుకురావాలని తాపత్రయపదుతున్నాడట . అయితే ఇది అయ్యే పనేనా?? జక్కన్న అసలే సినిమాని చెక్కుతుంటాడు. బాహుబలి 2పై ఉన్న అంచనాల దృష్ట్యా ఆ చెక్కుడు కార్యక్రమం మరింత బీభత్సంగా ఉంటుంది. కాబట్టి.. ప్రభాస్ ఆశలు అడియాశలు అయ్యే అవకాశాలే ఎక్కువ.