బాహుబలి దేశవ్యాప్తంగా ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది. అలాంటి భారీ సినిమా తర్వాత వస్తున్న చిత్రం కావడంతో సాహో విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. మేకింగ్‌పరంగా ఎక్కడా రాజీపడొద్దనుకున్నాం అన్నారు ప్రభాస్. ఆయన కథానాయకుడిగా సుజీత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ నిర్మించిన యాక్షన్ థ్రిల్లర్ సాహో ఈ నెల 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలకాబోతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసి సమావేశంలో ప్రభాస్ చిత్ర విశేషాల్ని మీడియా వారితో పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ..సాహో స్ర్కీన్‌ప్లే ప్రధానంగా సాగుతుంది. ఏ హాలీవుడ్ చిత్రానికి సంబంధం ఉండదు. మేకింగ్ స్టైలిష్‌గా ఉంటుంది. రొమాంచితమైన యాక్షన్‌తో పాటు కదిలించే ప్రేమకథ ఉంటుంది. బాహుబలి తర్వాతి చిత్రం కాబట్టి నిర్మాణ సమయంతో మాపై తీవ్రమైన ఒత్తిడి ఉండేది. అందుకే సాబుసిరిల్, కమల్‌కన్నన్, శ్రీకర్ ప్రసాద్ వంటి లబ్దప్రతిష్టులైన సాంకేతిక నిపుణులతో పాటు చైనా, హాలీవుడ్‌కు చెందిన టెక్నీషియన్స్ తీసుకున్నాం. కెరీర్లో రెండో సినిమా అయినప్పటికీ దర్శకుడు సుజీత్ ఎక్కడా టెన్షన్‌కు గురికాలేదు. తొలిరోజు షూటింగ్‌లోనే ఆయన సత్తా ఏమిటో తెలిసిపోయింది. ఈ సినిమా ట్రైలర్ కోసం 137 కట్స్ చేశాం. అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది. థియేటర్లో ట్రైలర్ చూసి నేనే థ్రిల్ ఫీలయ్యాను. సినిమా విడుదలయ్యాక ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలు సమాధారం దొరుకుతుందని భావిస్తున్నాఅన్నారు. ఈ సినిమాతో మీరు బాలీవుడ్లో ఖాన్ల తరహాలో సూపర్‌స్టార్‌డమ్‌ను సంపాదించుబోతున్నారా అని ప్రశ్నించగా…ఖాన్ల త్రయం ఎన్నో గొప్ప చిత్రాలతో దేశవ్యాప్తంగా పేరు సంపాదించుకున్నారని, వారితో పోటీ అనే మాటే అర్థంలేనిదని చెప్పారు. ట్రైలర్లో కొడితే స్టేడియంలోనే సిక్స్ కొట్టాలనే డైలాగ్ చాలా పాపులర్ అయిందని, నిజ జీవితంలో మీరు క్రికెట్లో ఎక్కువగా సిక్స్‌లే కొడతారా అని అడగ్గా…క్రికెట్లో తనక డిఫెన్స్ ఆడటం అస్సలు తెలియదని, సిక్సర్స్ కొట్టడానికే ఎప్పుడూ ప్రయత్నిస్తానని చెప్పారు ప్రభాస్. హిందీలో తానే సొంతంగా డబ్బింగ్ చెప్పానని, ఉత్తర్ ప్రదేశ్ హిందీ యాసలో డబ్బింగ్ చెప్పడం కొంచెం కష్టంగా అనిపించిందని, అందుకోసం ఓ శిక్షకుడిని నియమించుకున్నానని తెలిపారు. సినిమాలకు సుదీర్ఘంగా సమయం తీసుకుంటున్నారని అభిమానులు ఫీలవుతున్నారని, ఇకముందు త్వరగా సినిమాలు పూర్తి చేసి వారిని సంతోషపెడతానన్నారు. ట్రైలర్లో కనిపించే ట్రక్ ఫైట్‌ను సీజీలో కాకుండా రియల్‌గా తీశామని హాలీవుడ్ ట్రాన్స్‌ఫార్మర్స్‌లో నటించిన ట్రక్ డ్రైవర్ ఆ సీక్వెన్స్‌లో నటించాడని ప్రభాస్ పేర్కొన్నారు. యాక్షన్ ఘట్టాల కోసం ఎనిమిది నెలలు శిక్షణ తీసుకున్నామన్నారు. ట్రైలర్ చూసి రాజమౌళి సంతోషంగా ఫీలయ్యారని, చిరంజీవి మెసేజ్ చేసి మెచ్చుకోవడంతో థ్రిల్‌గా అనిపించిందని చెప్పారు. ప్రస్తుతం తాను గోపీకృష్ణ బ్యానర్లో చేస్తున్న ప్రేమకథా చిత్రం ముప్పైరోజులు షూటింగ్ పూర్తిచేసుకుందని ప్రభాస్ చెప్పారు.