టాలీవుడ్ లోనే కాదు, ఆల్ ఇండియాలోనే బిజీ బిజీగా ఉన్న కథానాయకుడు ఎవరంటే ప్రభాస్ పేరే చెబుతారంతా. తన చేతిలో అన్ని ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రస్తుతం ‘రాజాసాబ్’ పని ముగించడంలో తలమునకలై ఉన్నాడు ప్రభాస్. ఇటీవల యూరప్ వెళ్లిన ప్రభాస్, తిరిగొచ్చి ‘రాజాసాబ్’ షూటింగ్ లో పాలు పంచుకొంటున్నారు. హైదరాబాద్ లో ప్రస్తుతం `రాజాసాబ్` షూటింగ్ జరుగుతోంది. ఓ భారీ ఫైట్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్నారు. రామ్ లక్ష్మణ్ నేతృత్వం వహిస్తున్న ఈ ఫైట్.. సినిమాలో కీలకంగా మారబోతోందని టాక్.
మరోవైపు ఫిబ్రవరిలో ‘ఫౌజీ’కి డేట్లు కేటాయించాడు ప్రభాస్. మధురైలో ఓ షెడ్యూల్ జరగబోతోంది. అక్కడ హీరో ఫ్యామిలీకి సంబంధించిన సన్నివేశాలు తెరకెక్కిస్తారు. ఇందులో ప్రభాస్ ఓ బ్రాహ్మణ యువకుడిగా కనిపించబోతున్నాడు. అగ్రహారం సెటప్ లో ఈ సీన్లు రూపొందించనున్నారు. కనీసం ఫిబ్రవరిలో 20 రోజుల పాటు ఈ షెడ్యూల్ సాగుతుందని టాక్. ఆ తరవాత.. ‘కల్కి 2’ సిట్టింగ్స్ లో ప్రభాస్ పాలు పంచుకొంటాడు. దాంతో పాటు ‘స్పిరిట్’కు సంబంధించిన చర్చలు కూడా సాగుతున్నాయి. రాజాసాబ్ ని ఏప్రిల్ లో విడుదల చేద్దామనుకొన్నారు. కానీ జూన్, లేదా జూలైలో రాబోతోంది. ఫిబ్రవరిలో ఓ టీజర్ విడుదల చేసే అవకాశం ఉంది. ఇప్పటికే టీజర్ కట్ పూర్తయ్యింది. ప్రస్తుతం టీజర్‌కు తుదిమెరుగులు దిద్దుతున్నారు.