రాజమౌళితో సినిమా అంటే ఏ హీరో అయినా ఎగిరి గంతేస్తాడు. ఆ సినిమా బ్లాక్ బ్లస్టర్ హిట్టవ్వడం ఖాయం. కానీ… ఆ తరవాతే సదరు హీరో పరిస్థితి ఇరకాటంలో పడిపోతుంటుంది. రాజమౌళితో సినిమా తీసి, హిట్టు కొట్టిన ఏ హీరో కూడా ఆ వెంటనే మరో హిట్టు అందుకోలేకపోయాడు. సింహాద్రి తరవాత ఎన్టీఆర్, ఛత్రపతి తరవాత ప్రభాస్, విక్రమార్కుడు తరవాత రవితేజ, మగధీర తరవాత చరణ్ పరిస్థితి అలానే తయారైంది. దాంతో రాజమౌళితో సినిమా చేసిన వాళ్లకు వెంటనే ఓ ఫ్లాప్ వచ్చేస్తుందన్న సెంటిమెంట్ ఒకటి బాగా ప్రచారంలోకి వచ్చింది.
సాహో సమయంలోనే ఆ సెంటిమెంట్ ప్రభాస్ అభిమానుల్ని బాగా భయపెట్టింది. బాహుబలి 1, బాహుబలి 2 విజయాలు ప్రభాస్ ఇమేజ్‌ని ఆకాశాన్ని తాకేలా చేశాయి. తన మార్కెట్ పెరిగింది. దాంతో బడ్జెట్లూ పెంచాల్సివచ్చింది. ఈ ఒత్తిడిని ప్రభాస్ హ్యాండిల్ చేస్తాడా, చేయగలడా? అనే డౌట్లు ఎన్నో బయల్దేరాయి. దానికి తోడు కేవలం ఒక్క సినిమా చేసిన సుజిత్‌కి అవకాశం కట్టబెట్టడం కూడా అనుమానాల్ని బలపరిచేలా చేశాయి. కానీ.. ప్రభాస్ అభిమానులు కేవలం ప్రభాస్‌నే నమ్మారు. ప్రభాస్ స్టార్ డమ్, ప్రభాస్‌కి పెరిగిన క్రేజ్ సినిమాని నిలబెడతాయని భావించారు. రాష్ట్ర వ్యాప్తంగా సాహో సినిమాకి వస్తోన్న ఓపెనింగ్స్ చూస్తే – బాహుబలి వల్ల ప్రభాస్ క్రేజ్ ఏమాత్రం పెరిగిందో అర్థం చేసుకోవొచ్చు. సాహోకి పాజిటీవ్ టాక్ వస్తే – ఈ వసూళ్లు మరో నాలుగు రోజులు ఇలానే కొనసాగుదును. కానీ.. అలా జరక్కపోవడం.. ప్రతీచోటా.. ఈ సినిమాకి నెగిటీవ్ టాక్ రావడం – ప్రభాస్ అభిమానుల్నే కాదు, సినిమా ప్రియుల్నీ విస్మయానికి గురి చేస్తోంది. రాజమౌళి యాంటీ సెంటిమెంట్ ప్రభాస్ విషయంలోనూ వర్కవుట్ అవ్వడంతో ఈ సెంటిమెంట్ మరింత బలపడిపోయింది. `ఆర్.ఆర్.ఆర్` తరవాత చరణ్, ఎన్టీఆర్‌లు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే.