ఆదిపురుష్ వసూళ్లు ఒక పక్క, దానిపై వస్తున్న విమర్శలు ఓ పక్క.. మొత్తానికి ఎలాగోలా.. ఆదిపురుష్ వార్తల్లో ఉంటోంది. వాల్మీకి రాసిన రామాయణానికి – ఓం రౌత్ తీసిన రామాయణానికీ చాలా తేడా ఉందన్నది జగమెరిగిన సత్యం. అతను ఏ ఉద్దేశ్యంతో తీసినా సరే, ఇప్పుడు విమర్శల్ని ఎదుర్కోక తప్పడం లేదు. జనం దృష్టిలో ఓం రౌత్ చరిత్రని వక్రీకరించిన దర్శకుడే కావొచ్చు. కానీ తనని నమ్ముకొన్న టీ – సిరీస్‌కి మాత్రం లాభాల్నే తీసుకొచ్చాడు. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్‌తోనే టీ సిరీస్ గట్టేక్కేసింది. అయితే ఈ క్రెడిట్లో సగం ప్రభాస్‌కి ఇవ్వాలి. ఎందుకంటే ప్రభాస్ తీసుకొన్న ఓ నిర్ణయమే.. ఆదిపురుష్‌ని ఆర్థికంగా గట్టెక్కించింది.
ఆదిపురుష్ దాదాపుగా 3 గంటల సినిమా. రషెష్ చూసుకొంటే మరో 20 నిమిషాలు ఎక్కువే ఉంది. అంటే దాదాపు మూడున్నర గంటల సినిమా ఇది. రెండు భాగాల ట్రెండ్ బాగా జోరుగా ఉన్న ఈ తరుణంలో ఆదిపురుష్‌ని కూడా 2 భాగాలుగా చేయాలని, అప్పుడు కమర్షియల్ గా మరింత వర్కవుట్ అవుతుందని ఓం రౌత్ భావించాడట. మరో నెల రోజులు షూటింగ్ చేస్తే – ఆదిపురుష్ పార్ట్ 2 కూడా రెడీ అయ్యేది. కానీ… ప్రభాస్ దానికి నో చెప్పాడట. రెండు భాగాల ప్లాన్ ప్రతీ సినిమాకీ పని చేయదని, ఆదిపురుష్ లాంటి సినిమాకి అస్సలు నప్పదని నచ్చజెప్పాడట. అంతే కాదు.. తన చేతిలో చాలా సినిమాలున్నాయని, కాల్షీట్లు కేటాయించలేనని అన్నాడట. దాంతో… చిత్రబృందం పార్ట్ 2 ఆలోచన విరమించింది.
ఆదిపురుష్‌ని రెండు భాగాలుగా చేసి విడుదల చేస్తే.. పార్ట్ 2కి అస్సలు బజ్ ఉండేది కాదు. పైగా ఇప్పటికే ఆదిపురుష్‌ని అసంపూర్ణ రామాయణం అంటున్నారు. అప్పుడు అర్థ రామాయణం అనేవారేమో..?