ప్రభాస్… తెరపై హీ మాన్లా కనిపిస్తాడు. టాలీవుడ్ సూపర్ మేన్‌లా విన్యాసాలు చేస్తాడు. భారీ డైలాగులు చెబుతాడు. కానీ… మీడియా ముందుకొస్తే మాత్రం – సిగ్గు, బిడయం కమ్ముకొచ్చేస్తుంటాయి. స్టేజీపై ప్రభాస్ గల గల మాట్లాడడం చాలా అరుదు. మీడియా ముందు కూడా అంతే. తన ఇన్నేళ్ల కెరీర్లో గుర్తుండిపోయే ఇంటర్వ్యూ ఒక్కటీ బయటకు రాలేదు. దానికి గల కారణం.. ప్రభాస్ మనసు విప్పకపోవడమే. మీడియా అంటే చిన్నచూపు కాదు. ఎలా మసులుకోవాలో తెలీక. కానీ ఇప్పుడు ఆ ప్రభాస్ వేరు.. ఈ ప్రభాస్ వేరు. ప్రభాస్ చాలా మారాడు. బహుశా బాహుబలి మార్చి ఉంటుంది.
బాహుబలి కోసం నేషనల్ మీడియా చుట్టూ తిరిగాడు ప్రభాస్. ఆ అవసరం అలా ఏర్పడింది. ఆ సినిమాని మార్కెట్ చేసుకోవడం కోసం ఆ వ్యూహం తప్పలేదు. ఎప్పుడూ ఇవ్వలేనన్ని ఇంటర్వ్యూలు వచ్చాడు. టాక్ షోలలో పాల్గొన్నాడు. దాంతో కాస్త అనుభవం వచ్చినట్టుంది. అది సాహోకి బాగా ఉపయోగపడుతోంది. బాహుబలి కంటే ఎక్కువగా మీడియాకు సమయం కేటాయించాడు ప్రభాస్. దాంతో మీడియా అంటే ఉండే బిడియం అవీ బాగా తగ్గిపోయినట్టు కనిపిస్తున్నాయి. గత రెండు రోజులుగా తెలుగు మీడియాకు ఎడతెరపి లేకుండా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు ప్రభాస్. ఆదివారం అర్థరాత్రి వరకూ ఇంటర్వ్యూలు సాగాయి. సోమవారం సాయింత్రం మళ్లీ మొదలయ్యాయి. ప్రింట్ అండ్ ఎలక్ట్రానికి మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ మరింత జోవియల్‌గా కనిపించాడు. ఎప్పటిలా పొడి పొడి మాటలు మాట్లాడకుండా.. కాస్త ఆసక్తికరమైన సమాధానాలు చెప్పాడు. కొన్ని క్లిష్టమైన ప్రశ్నల్ని తెలివిగా దాటేశాడు.
మీ పెళ్లెప్పుడు అనే ప్రశ్ననే.. “సాహో టీమ్ ఒత్తిడంతా మీరు స్వీకరిస్తున్నారు. మరి మీ ఒత్తిడి స్వీకరించే జీవిత భాగస్వామి ఎప్పుడొస్తుంది” అంటూ కాస్త మార్చి అడిగితే
“నా ఒత్తిడి తాను తీసుకుంటుందో.. తానే నాపై ప్రెజర్ పెడుతుందో” అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చాడు ప్రభాస్.
ఆ నవ్వుల్లో అసలు ప్రశ్న.. దాని జవాబూ కనుమరుగైపోయాయి. అలానే మరిన్ని ప్రశ్నలకు ప్రభాస్ తెలివిగానే సమాధానం చెప్పాడు. ఈ సినిమాలో మీది డ్యూయల్ రోలా? అని అడిగితే `డ్యూయల్ రోల్ కాకపోవొచ్చు` అని విచిత్రమైన సమాధానం ఇచ్చాడు. కథ ఇప్పుడు చెప్పేసినా నష్టమేం లేదని, కానీ.. ఆ క్యూరియాసిటీ థియేటర్లకు వచ్చేంత వరకూ ఉంచాలన్న ఉద్దేశంతోనే కథ దాస్తున్నామని చెప్పుకొచ్చాడు.
మేమేదో అద్భుతం తీశాం, బాహుబలిలా రికార్డులు బ్రేక్ చేస్తుంది, షేక్ చేస్తుంది.. అని డబ్బాలు కొట్టుకోకుండా, ఈ సినిమాపై ఇప్పటికే పెరిగిన అంచనాల భారం మరింత పెరక్కుండా – చాలా మెచ్చూర్డ్‌గా సమాధానాలు ఇచ్చాడు. ఇదంతా చూస్తుంటే ప్రభాస్ చాలా మారిపోయాడనిపిస్తోంది. ప్రభాస్ ని కెరీర్ ముందు నుంచీ గమనిస్తున్న పాత్రికేయుల్ని సైతం ప్రభాస్‌లో మార్పు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. నిజానికి ఇంత ఇమేజ్ వచ్చాక, ఇంత క్రేజ్ వచ్చాక ప్రభాస్ మీడియాకి మరింత దూరంగా ఉంటాడేమో అనుకున్నారు. కానీ తన సింప్లిసిటీతో మరోసారి మనసుల్ని గెలుచుకున్నాడు.
ఇంత ఎదిగినా – అంత సింప్లిసిటీగా ఎలా ఉంటారు? అని అడిగితే..
“నాకంటే ఎక్కువ విజయాలు సాధించినవాళ్లు చాలా వినయంగా ఉన్నారు. రాజమౌళిని పన్నెండేళ్లుగా చూస్తున్నా. ఆయన అప్పుడూ ఇప్పుడూ ఒకేలా ఉన్నారు. చిరంజీవి, రజనీకాంత్‌లు కూడా ఎంతో ఎదిగినా అలానే ఉన్నారు. నేనెంత” అంటూ మరింత సింపుల్‌గా మాట్లాడి తన సింప్లిసిటీని చాటుకున్నాడు. ఈ విషయంలో మాత్రం ప్రభాస్ ఏమాత్రం మారలేదబ్బా..!