హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా ఇవాళ విడుదలైన బాహుబలి చిత్రం, టాక్ విషయం పక్కన పెడితే సంచలనస్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టుకుంటోంది. ఎక్కడచూసినా ధియేటర్లవద్ద విపరీతంగా కిక్కిరిసిన క్యూలైన్లు, తొక్కిసలాటలు కనబడుతున్నాయి. గుంపును నియంత్రించటానికి అనేకచోట్ల పోలీసులు, రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. పలుచోట్ల లాఠీ ఛార్జిలుకూడా చేశారు. టికెట్లు దొరకనివారు ధియేటర్ల యాజమాన్యాలే బ్లాక్ వ్యాపారం చేయిస్తున్నాయని ఆగ్రహంతో రాళ్ళువేయటంవంటి ఘటనలుకూడా చోటుచేసుకున్నాయి. మరోవైపు ప్రభాస్ అభిమానులగురించి చెప్పనలవికాకుండా ఉంది. మూడేళ్ళతర్వాత తమ హీరో చిత్రం విడుదలవుతుండటంతో వారి ఆనందానికి అంతులేకుండా పోయింది. ధియేటర్లవద్ద వారు విపరీతమైన సందడి చేస్తున్నారు. అయితే రంగారెడ్డిజిల్లా వికారాబద్లో ఒక అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. అభిమానులు తమ హీరో కటౌట్లకు పాలాభిషేకం చేయటం, గుమ్మడికాయలతో దిష్టితీయటం సాధారణమైనప్పటికీ, వికారాబాద్ అభిమానులు విలక్షణంగా మొదటి షో ముందు మేకపోతును బలి ఇచ్చి దాని రక్తంతో ప్రభాస్ పోస్టర్‌కు తిలకం దిద్దారు. సినీమాక్స్ ధియేటర్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ ఫోటో ఇప్పుడు వాట్సప్‌లో రౌండ్లు కొడుతోంది. దీనిగురించి ఆ ధియేటర్ యాజమాన్యాన్ని ప్రశ్నించగా, తాము రిలీజ్ హడావుడిలో ఉండి గమనించలేదని, ఎవరో చెప్పటంతో బయటకెళ్ళి చూసేసరికి వారు ఆ మేకపోతును ఆటోలో వేసుకుని పరారయ్యారని చెప్పారు.