ప్రాజెక్ట్ కెపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా బాహుబలి రికార్డులు బద్దలు కొడుతుందన్నది అందరి నమ్మకం. స్టార్ కాస్టింగ్ ఆ రేంజ్లో ఉంది. బడ్జెట్ విషయంలోనూ అశ్వనీదత్ ఎక్కడా తగ్గడం లేదు. దేశంలోనే అత్యంత ఖరీదైన చిత్రంగా ప్రాజెక్ట్ కెని నిలపాలన్నది ఆయన ప్రయత్నం. నాగ అశ్విన్ ఏదో అద్భుతాన్ని సృష్టిస్తాడని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న వేళ.. ప్రాజెక్ట్ కె లుక్కులు బయటకు వచ్చాయి. దీపికా పదుకొణె లుక్ ఏమాత్రం ఆసక్తిని రేకెత్తించలేదు. ఆ తరవాత వచ్చిన ప్రభాస్ లుక్ చూస్తే… ఈ సినిమాపై మొట్టమొదటి సారి అనుమానాలు కలిగాయి. ప్రభాస్ ఫ్యాన్స్ సైతం ఈ లుక్ చూసి పెదవి విరిచారు. అంచనాలకు ఏమాత్రం దరిదాపుల్లో నిలవలేని లుక్కులతో ప్రభాస్ ఫ్యాన్స్‌ని ప్రాజెక్ట్ కె భయపెట్టింది.
అయితే ఇప్పుడు ఫస్ట్ గ్లిమ్స్ బయటకు వచ్చింది. నాగ అశ్విన్ ఈసినిమా కోసం మరో.. ప్రపంచాన్ని సృష్టించాడన్న విషయం ఈ గ్లిమ్స్ చూస్తే అర్థమైపోతుంది. ఆ కలర్, టోన్, క్యారెక్టర్లకు ఇచ్చిన కాస్ట్యూమ్స్ అన్నీ కొత్తగా ఉన్నాయి. హాలీవుడ్ టింజ్ కనిపించింది. ఈ గ్లిమ్స్ తో.. ప్రభాస్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకొన్నారు. తెరపై ఇప్పటి వరకూ చూడని ఓ అద్భుతం కళ్లముందుకు రానుందన్న భరోసా ఈ గ్లిమ్స్ తో మరోసారి కలిగింది. ప్రాజెక్ట్ కె అంటే.. కల్కి అని ముందు నుంచీ ప్రచారం జరుగుతూనే ఉంది. అదే ఇప్పుడు నిజమైంది. ఈ సినిమాకి కల్కి అని నామకరణం చేసేశారు. కలియుగం అంతమయ్యే సమయంలో కల్కి అవతరిస్తాడని అందరి నమ్మకం. ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర కల్కి అవతారాన్ని పోలి ఉంటుంది. అందుకే ఆ పేరు పెట్టారు. పురాణాల్లోని కొన్ని పాత్రలు కొత్త రూపంలో ఈ సినిమాలో మెదలబోతున్నాయి. వాటి ప్రవర్తన, ప్రభావం పురాణ పురుషుల్ని గుర్తు తెచ్చేలా ఉంటుంది. అయితే పురాణాలకూ ఈ కథకూ సంబంధం లేదు.