ప్రభాస్ లాంటి హీరో డేట్లు ఇస్తే, ఏ నిర్మాతా బడ్జెట్ గురించి బెంగ పెట్టుకోదు. మైత్రీ మూవీస్ సంస్థ అయితే అస్సలు ఆలోచించదు. ప్రభాస్ – హనురాఘవపూడి కాంబినేషన్లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. దీనికి ‘ఫౌజీ’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ సినిమా బడ్జెట్ దాదాపు రూ.600 కోట్లని ఇన్ సైడ్ వర్గాల టాక్. మైత్రీ మూవీస్ ఎన్నో భారీ చిత్రాల్ని అందించింది. అయితే ఆ సంస్థలో తెరకెక్కుతున్న అత్యంత ఖరీదైన సినిమా ఇదే కావడం విశేషం. ‘పుష్ప 2’ కోసం మైత్రీ దాదాపు రూ.400 కోట్లు ఖర్చు చేసింది. దానికంటే `ఫౌజీ`పై రూ.200 కోట్లు అదనంగా పెట్టుబడి పెడుతోంది.
ఈ రిస్క్ అంతా ప్రభాస్ పై మైత్రీకి ఉన్న నమ్మకంతోనే అనిపిస్తోంది. ఎందుకంటే హనుకి ఇది వరకు భారీ కమర్షియల్ హిట్లు లేవు. ‘సీతారామం’ మంచి హిట్. కానీ.. మరుసటికి సినిమాకు రూ.600 కోట్ల పెట్టుబడి పెట్టేంత కాదు. ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ పూర్తయ్యింది. ఆ రషెస్ చూసుకొన్న మైత్రీ క్వాలిటీపై పూర్తి సంతృప్తితో వుంది. అందుకే హను ఏది అడిగితే అది ఇవ్వడానికి రెడీ అవుతోంది. నిజానికి ఈ సినిమా మొదలెట్టేటప్పుడు రూ.600 కోట్ల బడ్జెట్ అవుతుందని ఊహించలేదట. కానీ కథపై, హను ఈ సినిమాని తీస్తున్న విధానంపై రోజు రోజుకీ నమ్మకం పెరుగుతూ పోవడం వల్ల ఈ స్థాయిలో ఖర్చు పెట్టడానికి రెడీ అవుతున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో కొన్ని వార్ ఎపిసోడ్లు ఉన్నాయని, వాటి కోసమే ఎక్కువ బడ్జెట్ కేటాయించాల్సివస్తోందని టాక్. మరి ఆ వార్ ఎపిసోడ్లు ఏ రేంజ్లో వస్తున్నాయో మరి.