ప్రభాస్ – హను రాఘవపూడి కాంబోలో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రం కోసం ‘ఫౌజీ’ అనే పేరు పరిశీలనలో వుంది. అవుట్ పుట్ పై మైత్రీ మూవీస్ చాలా సంతృప్తిగా ఉంది. ప్రభాస్ కు కూడా రాఘవపూడి వర్కింగ్ స్టైల్ బాగా నచ్చిందని సమాచారం. ఎక్కడకు వెళ్లినా హను సినిమా మేకింగ్ ముచ్చట్లే ఏకరువు పెడుతున్నాడట. అంతేకాదు.. ఇప్పుడు మరో సినిమా చేసే ఆఫర్ ఇచ్చాడని తెలుస్తోంది.
‘ఫౌజీ’ పూర్తవ్వకుండానే మరో హనుతో మరో సినిమా చేయడానికి ప్రభాస్ అంగీకరించాడట. అంతేకాదు.. ఓ అగ్ర నిర్మాతతో హనుకు అడ్వాన్స్ కూడా ఇప్పించాడని తెలుస్తోంది. ఈ ప్రపోజల్ తీసుకొచ్చింది, ప్రాజెక్ట్ సెట్ చేసింది కూడా ప్రభాసే అని సమాచారం. కాకపోతే.. ఈ ప్రాజెక్ట్ ఇప్పట్లో పట్టాలెక్కడం కష్టం. ఎందుకంటే ‘ఫౌజీ’ అవ్వగానే `స్పిరిట్` మొదలవుతుంది. మధ్యలో ప్రశాంత్ వర్మ `బ్రహ్మరాక్షస్` ఉంది. ‘సలార్ 2’ కోసం డేట్లు ఇవ్వాలి. `కల్కి 2` వుంది. వీటి మధ్యలో.. హను సినిమా ఉండొచ్చు. అయితే ఈసారి ప్రభాస్ తో కంప్లీట్ లవ్ స్టోరీ చేయడానికి హను ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. లవ్ స్టోరీ కాబట్టి, యాక్షన్ బాధలు లేవు కాబట్టి, సింపుల్ గా, చాలా ఫాస్ట్ గా ఈ సినిమాని పూర్తి చేసే అవకాశం ఉంది.
ప్రస్తుతం ప్రభాస్ విదేశాల్లో ఉన్నారు. ఆయన ఈ నెలాఖరున తిరిగి వస్తారని సమాచారం. రాగానే `రాజాసాబ్` కోసం కొన్ని డేట్లు ఇస్తారు. దాంతో పాటు `ఫౌజీ` సినిమానీ కంప్లీట్ చేసే అవకాశం ఉంది.