ప్రభాస్ – హను రాఘవపూడి కాంబోలో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. హను సినిమా అనగానే అది లవ్ స్టోరీ అని చాలామంది భావించారు. ఇప్పటికీ ప్రచారం అలానే జరుగుతోంది. అయితే… హను ఈసారి రూటు మార్చాడు. యుద్ధ నేపథ్యంలో సాగే ఓ యాక్షన్ డ్రామాని ఎంచుకొన్నాడు. అందులో లవ్ స్టోరీని మిళితం చేశాడు. ఈసారి స్వాతంత్ర్యానికి పూర్వం జరిగిన కథని చెప్పబోతున్నాడు.
Read Also :హాట్ టాపిక్: ప్రభాస్ పారితోషికం తగ్గించుకొన్నాడా?
భారత స్వాతంత్ర్య సంగ్రామం అనగానే సుభాష్ చంద్రబోస్ తప్పకుండా గుర్తొస్తారు. ఆయన స్థాపించిన ఆజాద్ హిందు ఫౌజ్ గురించి కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిందే. ప్రభాస్ సినిమాలో ఈ అంశాలు మిళితం చేశాడని తెలుస్తోంది. ఆజాద్ హిందు ఫౌజ్ సభ్యుడిగా ప్రభాస్ కనిపిస్తాడని ఇన్ సైడ్ వర్గాల టాక్. ఈ సినిమా కోసం ‘ఫౌజీ’ అనే టైటిల్ ఫిక్స్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుగు 360 ముందే చెప్పింది. ఆ టైటిలే ఫిక్సయ్యే ఛాన్సుంది. ఇందులో ప్రభాస్ ఓ బ్రాహ్మణ యువకుడిగా కనిపిస్తాడని సమాచారం. ఆగస్టు 22 నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. కథానాయిక ఎవరన్న విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ‘సీతారామం’ చిత్రానికి స్వరాలు అందించిన విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రానికీ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే మూడు పాటలు సిద్ధమయ్యాయని టాక్. మైత్రీ మూవీస్ ఈ చిత్రాన్ని రూపొందించనుంది. పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.