రేపు ప్రభాస్ పుట్టినరోజు. ఆ సంబరాలు ఈరోజే మొదలైపోయాయి. దానికి కారణం.. బాహుబలి 2 ఫస్ట్ లుక్ ఈరోజే బయటపెట్టారు. అమరేంద్ర బాహుబలిగా ప్రభాస్ ని చూపిస్తూ పోస్టర్ని విడుదల చేశారు. ఓ చేతిలో కత్తి.. మరో చేతిలో గొలుసు, సిక్స్‌ప్యాక్ దేహం… కళ్లలో అంతులేని మెరుపుతో ప్రభాస్ ఫస్ట్ లుక్ అదిరిపోయినట్టే. అప్పుడే సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్‌లో బాహుబలి 2 పోస్టర్ హల్ చల్ చేయడం మొదలెట్టేసింది. ప్రభాస్ అభిమానులకు ఈ లుక్ భలేగా నచ్చేసింది. ఇంకా ఏదో ఆశించిన వాళ్లు మాత్రం `ఇంకాస్త గ్రాండ్‌గా ఉంటే బాగుండేది` అంటూ నానుస్తున్నారు. బాహుబలి 2 పోస్టర్ రెగ్యులర్‌గానే ఉందని, కొత్త విషయం ఏమీ లేదని చెబుతున్న వాళ్లూ ఉన్నారు. అయితే.. ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఇవేం పట్టించుకోవడం లేదు. ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా రేపు (ఆదివారం) బాహుబలికి సంబంధించిన కొన్ని మేకింగ్ విజువల్స్ విడుదల చేయనున్నారు. బాహుబలి 2 ఫస్ట్ లుక్ వచ్చేసింది కాబట్టి ఇక నుంచి బాహుబలి 2కి సంబంధించిన మరిన్ని పోస్టర్లు, లుక్లూ విరివిగా బయటకు వచ్చే ఛాన్సుంది. దాదాపు 800 కోట్లను ఆర్జించడమే లక్ష్యంగా రూపొందిన బాహుబలి 2ని 2017 ఏప్రిల్ 28న విడుదల చేయనున్నారు.