పూరి జగన్నాధ్ కి ప్రభాస్ చాలా పెద్ద సాయమే చేశాడు. రొమాంటిక్ సినిమా ప్రమోషన్స్ లో భాగస్వామి అయ్యాడు. ట్వీట్ చేయడమో, పోస్ట్ పెట్టడమో కాదు.. ఏకంగా ఒక ఫుల్ డే కాల్ షీట్ ఇచ్చేశాడు. రొమాంటిక్ టీజర్ ప్రభాస్ చేతుల మీదగానే విడుదలైయింది. టీజర్ రిలీజ్ సందర్భంగా టీంతో చిట్ చాట్ చేశాడు ప్రభాస్. తాజాగా రొమాంటిక్ హీరో హీరోయిన్లని ఇంటర్వ్యూ చేశాడు. ఇప్పుడీ ఇంటర్వ్యూ యూట్యూబ్ టాప్ ట్రెండ్ లో వుంది.
పూరి- ప్రభాస్ ల మధ్య మంచి స్నేహం వుంది. వీరి కలయికలో మొదట వచ్చిన ‘ఎక్ నిరంజన్’ పెద్దగా ఆడలేదు. అయితే ‘బుజ్జిగాడు’ మాత్రం మాస్ చేత విజల్స్ వేయించింది. ప్రభాస్ ని డార్లింగ్ చేసింది. అయితే ఇది గతం. ఇప్పుడు ప్రభాస్ బాహుబలి. నేషనల్ స్టార్. ప్రభాస్ ఒక కాల్ షీటు ఏడు అంకెల్లో వుంటుంది. ఆయన ట్వీట్ చేస్తానని చెబితే కోట్లు కుమ్మరించే కంపెనీలు వున్నాయి. అలాంటి ప్రభాస్ ఒక రోజు మొత్తం కేటాయించి రొమాంటిక్ టీం కోసం ఇంటర్వ్యూ చేయడం అంటే కోట్ల రూపాయిల పబ్లిసిటీ ఇచ్చినట్లే. ప్రభాస్ రాకతో రొమాంటిక్ సినిమాకి కొత్త కలర్ వచ్చింది. ఈమధ్య కాలంలో ఒక మీడియం సినిమాకి ఈ రేంజ్ పబ్లి సిటీ రావడం రొమాంటిక్ సినిమాకే జరిగింది. మొత్తానికి రొమాంటిక్ పబ్లిసిటీ హిట్. పబ్లిసిటీలానే సినిమా కూడా హిట్ అయితే .. ఆకాష్ కి ఫస్ట్ హిట్ దక్కినట్టే.