హైదరాబాద్: ఎస్‌యూవీలు, ట్రాక్టర్లు, స్కూటర్లు తయారుచేసే మహీంద్ర ఆటో మొబైల్ కంపెనీ తమ సంస్థ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రభాస్‌ను నియమించుకున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ అంగీకరించిన మొట్టమొదటి యాడ్ కాంట్రాక్ట్ కూడా ఇదే. ప్రింట్ మీడియాలో ఆ యాడ్ ఇవాళ తొలిసారిగా విడుదలయింది.
ఇటీవల విడుదల చేసిన తమ నూతన వాహనం -‘టీయూవీ 300’కి ప్రమోషన్ క్యాంపెయిన్‌ను మహీంద్ర సంస్థ ఇవాళ ప్రారంభించింది. ప్రముఖ దినపత్రికలన్నింటిలో చిట్టచివరన ఫుల్ పేజి యాడ్లను రిలీజ్ చేసింది. యాడ్‌లో – పైన ప్రభాస్ ఫోటో, కింద మహీంద్ర కొత్త కంపాక్ట్ ఎస్యూవీ – ‘టీయూవీ 300’ ఫోటో ఉన్నాయి. ప్రభాస్ ఫోటో పక్కన ‘టఫ్ టు ది కోర్'(నిలువెల్లా పటిష్ఠం) అని క్యాప్షన్ పెట్టారు. ప్రభాస్ ఫోటో పైన ‘స్టారింగ్ ప్రభాస్ ఆఫ్ బాహుబలి ఫేమ్'(బాహుబలి ఫేమ్ ప్రభాస్ నటించు) అని రాసిఉంది.
బాహుబలిలో సిక్స్ ప్యాక్‌తో కండలు తిరిగిన శరీరంతో జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్‌ను మహీంద్ర సంస్థ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంచుకోవటం వెనక ఒక కారణం ఉంది. ఈ ‘టీయూవీ 300’ వాహనాన్ని పటిష్ఠంగా, యుద్ధ ట్యాంక్ పోలిన డిజైన్‌తో రూపొందించారు. ఆ ప్రత్యేకతను బాహుబలి లాంటి బాడీ ఉన్న ప్రభాస్ ద్వారా వినియోగదారులకు బలంగా చాటిచెప్పొచ్చని మహీంద్ర భావించినట్లు అర్థమవుతోంది.