అన్నీ కుదిరితే ఈపాటికి ప్రభాస్ – మారుతిల సినిమా పట్టాలెక్కేసేది. కానీ ఇంత వరకూ క్లాప్ కూడా కొట్టలేదు. దానికి చాలా కారణాలున్నాయి. ప్రభాస్ చేతిలో సలార్, ప్రాజెక్ట్ కె లాంటి భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. కృష్ణంరాజు చనిపోయారు. ప్రభాస్ కి చిన్న పాటి సర్జరీ కూడా అయ్యింది. అన్నింటికంటే ముఖ్యంగా మారుతి రాసుకొన్న కథలో భారీ మార్పులు – చేర్పులూ వచ్చి పడ్డాయి. ప్రభాస్ తో మారుతి సినిమా అనగానే ప్రభాస్ అభిమానులు భయపడ్డారు. మారుతిది అంతా మీడియం రేంజు హీరోల స్కూలు. ప్రభాస్ ఇమేజ్‌ని హ్యాండిల్ చేయలేడని బెంగ పెట్టుకొన్నారు. మారుతి కూడా తనదైన ఓల్డ్ స్కూల్ లో ఓ హారర్ కామెడీ కథ రాసుకొన్నాడు. హారర్ సినిమాలకు కాలం చెల్లిన ఈ రోజుల్లో ప్రభాస్ అలాంటి జోనర్‌ని ఎందుకు ఎంచుకొన్నాడో ఎవరికీ అంతు పట్టలేదు.
అయితే ఇప్పుడు ప్రభాస్ – మారుతిల కథ మొత్తం మారిపోయింది. ఇది హారర్ సినిమా కాదు. ఓ క్రైమ్ కామెడీ. వజ్రాల దోపిడీ నేపథ్యంలో సాగుతుందని సమాచారం. ఈ సినిమా ఆలస్యం అవ్వడానికి కారణం. కథలో భారీ మార్పులు చోటు చేసుకోవడమే. హారర్ కామెడీ కాస్త, క్రైమ్ కామెడీగా మారిపోయింది. నవంబరు నుంచి ఈ సినిమా పట్టాలెక్కే ఛాన్సుంది. వారం, పది రోజుల్లో ప్రభాస్ తో మారుతికి ఓ మీటింగ్ ఉంది. ఆ తరవాత… షూటింగ్ ఎప్పుడన్నది తేలిపోతుంది.