ప్రభాస్ రాబోయే సినిమాల లైనప్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేసే సరికి మరో 5 ఏళ్లయినా పడుతుంది. అన్నీ పాన్ ఇండియా ప్రాజెక్టులే. ఒక్కో సినిమాకీ రెండేళ్లు అనుకున్నా – ఐదేళ్ల వరకూ ప్రభాస్ ఎవరికీ దొరకడు.
రాధేశ్యామ్ తరవాత.. నాగ అశ్విన్ సినిమా మొదలవ్వాలి. ఇది వరకే.. ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. హీరోయిన్ గా దీపికా పదుకొణెని కూడా ఫిక్స్ చేసేశారు. అక్టోబరులో లాంఛనంగా మొదలెట్టాలని ప్లాన్. కానీ… ఈరోజు ప్రకటించిన `ఆది పురుష్` వల్ల నాగ అశ్విన్ సినిమా ఆలస్యం అవ్వబోతోందన్నది ఇన్ సైడ్ వర్గాల టాక్. `రాధేశ్యామ్` పూర్తవగానే.. `ఆది పురుష్` కొంత మేర షూటింగ్ జరుపుతారని తెలుస్తోంది. ఆ సినిమా ఓ షెడ్యూల్ పూర్తయిన తరవాతే… నాగ అశ్విన్ సినిమా మొదలవుతుందట. ఎందుకంటే.. `ఆదిపురుష్` విజువల్ ఎఫెక్ట్స్ ప్రాధాన్యం ఉన్న చిత్రం. కొంతమేర టాకీ పూర్తయితే.. మెల్లగా విజువల్ ఎఫెక్ట్స్‌కి సంబంధించిన పనులూ మొదలు పెట్టుకోవొచ్చన్నది దర్శక నిర్మాతల ఆలోచన. `ఆదిపురుష్`లో ప్రభాస్ తో పాటు మరికొంత మంది స్టార్స్ నటించనున్నారు. వాళ్ల కాంబినేషన్ల బట్టే కాల్షీట్లు సర్దుబాటు చేయాలి. `ఆది పురుష్` ముందే మొదలైనా… లైనప్ ప్రకారం మాత్రం నాగ అశ్విన్ సినిమానే విడుదల అవుతుంది.