సినిమా హిట్టయితే… ఎవరూ ఏం అడగరు. అందులో తప్పులు కూడా ఒప్పులైపోతాయి. ఫ్లాప్ అయితే మాత్రం పోస్ట్ మార్టమ్ చేసుకోవాల్సిందే. ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకుని, అది పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలి. రాధేశ్యామ్.. డిజాస్టర్ అయ్యింది. అది మామూలు డిజాస్టర్ కాదు. ప్రభాస్ స్టామినాని క్వశ్చన్ చేసిన ఫలితం అది. అందుకే… ప్రభాస్ రాధేశ్యామ్ లో తప్పొప్పులపై తీక్షణంగా దృష్టి పెట్టాడు. కారణాల్ని కూడా కనుక్కోగలిగాడు. ఓ తాజా ఇంటర్వ్యూలో రాధేశ్యామ్ ఫ్లాఫ్ అవ్వడానికి తాను కనుగొన్న కారణం బయట పెట్టాడు. తనని రొమాంటిక్ గా ఎవరూ చూడాలనుకోవడం లేదని, మరీ అంత సాఫ్ట్ క్యారెక్టర్లు నప్పవేమో అని… తీర్పు ఇచ్చేశాడు. ముమ్మాటికీ ఇది నిజం కూడా. వర్షం, డార్లింగ్ సినిమాలు చేసే వయసు కాదు ప్రభాస్ది. ఆ ఇమేజూ దాటిపోయింది. ప్రభాస్ కెరీర్ తీసుకుంటే మాస్,యాక్షన్ చిత్రాలు చేసినప్పుడే భారీ హిట్లు దక్కాయి. కాబట్టి.. ప్రభాస్ లవ్ స్టోరీలు, రొమాంటిక్ కథల వైపు దృష్టి పెట్టకపోవడమే మంచిది. రాధేశ్యామ్ పై వచ్చిన రివ్యూలు కూడా అవే చెప్పాయి. ప్రభాస్ కు లవ్ స్టోరీలు సెట్ అవ్వవని తేల్చేశాయి. ఇప్పుడు ప్రభాస్ కూడా అదే చెబుతున్నాడు. అంటే.. ఇక మీదట ప్రభాస్ లవ్ స్టోరీల జోలికి వెళ్లడన్నది అర్థమైపోయింది. ప్రభాస్ ఇప్పుడు చేస్తున్న సలార్ యాక్షన్ డ్రామా. ప్రాజెక్ట్ కె.. ఓ సైన్స్ ఫిక్షన్. ఆది పురుష్.. ఓ పౌరాణిక చిత్రం. సో.. ప్రభాస్ కూడా లవ్ స్టోరీలకు బాగా దూరమైపోయినట్టే.