ప్రస్తుతం ‘రాజాసాబ్’ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు ప్రభాస్. దాంతో పాటు ‘ఫౌజీ’ని కూడా మొదలు పెట్టబోతున్నాడు. ఈనెల 17 న ‘ఫౌజీ’ లాంఛనంగా ప్రారంభం కానుంది. ఆరోజే టైటిల్ ని కూడా అధికారికంగా ప్రకటించనున్నారు.
నిజానికి ఈనెల 18 నుంచి రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలు కావాలి. కానీ కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతోంది. వచ్చే నెల నుంచి తమిళ నాడులో ఓ షెడ్యూల్ ప్రారంభిస్తారు. ప్రభాస్ కు సంబంధించిన కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తారు. ఈ చిత్రంలో కథానాయికగా ‘సీతారామం’ ఫేమ్ మృణాల్ ఠాకూర్‌ని ఎంచుకొనే అవకాశాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. అయితే మృణాల్ మాత్రం ఈ సినిమాలో పని చేయడం లేదంటూ ఓ స్టేట్మెంట్ ఇచ్చింది. ఇప్పుడు త్రిష పేరు కూడా గట్టిగా వినిపిస్తోంది. ప్రభాస్ – త్రిషలది సూపర్ హిట్ కాంబో. ‘వర్షం’లో ఇద్దరూ జోడీగా నటించారు. అది ప్రభాస్ కెరీర్‌ని మలుపు తిప్పింది. ఆ తరవాత వచ్చిన ‘బుజ్జిగాడు’ కూడా అందరికీ నచ్చింది. మధ్యలో ‘పౌర్ణమి’ కాస్త నిరాశ పరిచినా, ప్రభాస్ – త్రిషల కెమిస్ట్రీ అందులో కూడా బాగా వర్కవుట్ అయ్యింది. అందుకే మరోసారి త్రిష వైపే మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. స్వాతంత్యం రాక ముందు జరిగే కథ ఇది. ప్రభాస్ బ్రిటీష్ సైనికుడిగా కనిపించబోతున్నాడని టాక్.