స్నేహానికి ప్రాణం ఇచ్చే వ్యక్తి… ప్రభాస్. తన సింప్లిసిటీ గురించి అందరికీ తెలిసిందే. తన వాళ్ల కోసం ఏమైనా చేస్తాడు. కొన్ని సినిమాలకు తనకు తానుగా ముందుకొచ్చి ప్రమోషన్ చేసిస్తాడు. `రొమాంటిక్` సినిమా కోసం ప్రభాస్ అదే చేస్తున్నాడు. పూరి తనయుడు ఆకాష్ పూరి – హీరోగా నటించిన చిత్రమిది. ఈనెల 29న విడుదల అవుతోంది. ఈ సినిమా ట్రైలర్ ప్రభాస్ చేతుల మీదుగానే విడుదలైంది. నిజానికి.. ప్రభాస్ తో ట్రైలర్ రిలీజ్ చేయించాలన్న ఆలోచన పూరిది కాదు. మొత్తంగా ప్రభాస్‌దే. `ట్రైలర్ నేను రిలీజ్ చేస్తా` అంటూ ప్రభాసే ముందుకొచ్చాడు. `ఓ ఈవెంట్ ప్లాన్ చేసుకో.. నేను వస్తా` అని పూరికి ప్రభాస్ మాటిచ్చాడు కూడా. ఈవెంట్ చేసేంత టైమ్ లేకపోవడంతో చిన్న గెట్ టు గెదర్ లా ఏర్పాటు చేసి, ఆ ఫుటేజీ ఆ తరవాత వదిలారు.
పూరితో ప్రభాస్ కి ఉన్న అనుబంధం తెలిసిందే. ఇద్దరి కాంబినేషన్ లో రెండు సినిమాలొచ్చాయి. `డార్లింగ్` అనే ప్రభాస్ ఊతపదాన్ని మాస్ కి చేరవేసింది.. పూరినే. ఏక్ నిరంజన్ తరవాత కూడా ఈ రిలేషన్ ఇంకా స్ట్రాంగ్ గా కొనసాగుతూనే ఉంది. ప్రభాస్ వచ్చి, సినిమా గురించి మాట్లాడితే – కచ్చితంగా మంచి పబ్లిసిటీ వస్తుంది. పూరి వారసుడిగా ఆకాష్ ఎదగాలంటే ఓ హిట్టు అవసరం. అందుకే.. ఈసినిమాకి తానంతట తాను వచ్చి ప్రమోషన్ చేశాడు ప్రభాస్. దానికి తోడు… ఈ సినిమాలో `డార్లింగ్.. డార్లింగ్` అంటూ ప్రభాస్‌ని గుర్తు చేసేశా ఓ పాట పెట్టారు. అందుకే ప్రభాస్ కూడా `నా డార్లింగ్స్ అంతా ఈసినిమాని చూసేయండి` అంటూ అభిమానులకు పిలుపు ఇచ్చాడు. ప్రభాస్ పబ్లిసిటీ ఈ ట్రైలర్ తోనే ఆగదు. త్వరలోనే ప్రభాస్ మరో రూపంలో.. ఈ సినిమాని ప్రమోట్ చేయాలనుకుంటున్నాడట. మరి.. అదేంటో? రొమాంటిక్ సినిమాకి అదెంత హెల్ప్ అవుతుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.