ప్రభాస్ సినిమా `రాధే శ్యామ్` యూరప్ నేపథ్యంలో సాగే కథ. స్క్రిప్టు ప్రకారం.. ప్రతీ షాట్ యూరప్ లోనే తీయాలి. షూటింగ్ కూడా అక్కడే జరిగింది. కానీ. ఇండోర్ సెట్లు మాత్రం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో వేసి తెరకెక్కించారు.కరోనా నేపథ్యంలో.. యూరప్ షెడ్యూల్ మొత్తం రద్దు అయ్యింది. అక్కడకి వెళ్లి షూటింగ్ చేసే పరిస్థితి లేదు. దాంతో.. అక్కడ తీయాల్సిన సీన్లు కూడా ఇండోర్ లోకి మార్చి.. హైదరాబాద్ లోని సెట్లలోనే తీసేద్దాం అనుకున్నారు. కానీ.. ఎంత చేసినా – యూరప్ లోనే తీయాల్సిన కొన్ని సీన్లు బాకీ పడుతున్నట్టు టాక్. అందుకోసమైనా ఓ చిన్న షెడ్యూల్ వేసుకుని, యూరప్ వెళ్లి రావాల్సిన పరిస్థితి వచ్చిందట. కనీసం వారం – పది రోజుల చిన్న షెడ్యూల్ లో యూరప్ వెళ్లి, కొన్ని అతి ముఖ్యమైన సన్నివేశాల్ని తెరకెక్కించాలని చిత్రబృందం నిర్ణయించుకుంది. అయితే.. అది ఇప్పుడే కాదు. కరోనాతో ఏర్పడ్డ విపత్కర పరిస్థితులు ముందు చక్కబడాలి. వాక్సిన్ రావాలి. కనీసం అంతర్జాతీయ ప్రయాణాలకు అనుమతులు దక్కాలి. ఇదంతా జరగడానికి కాస్త టైమ్ ఉంది. అందుకే ఈలోగా.. మిగిలిన షూటింగ్‌కి పూర్తి చేసేయాలని చిత్రబృందం భావిస్తుంది. చివరి షెడ్యూల్ గా యూరప్ షెడ్యూల్ ప్లాన్ చేస్తోంది. అయితే.. ఇదంతా… పరిస్థితులు చక్కబడిన తరవాతే. యూరప్‌లో షూటింగ్ అసాధ్యం అనుకుంటే.. చిత్రబృందం దగ్గర ప్లాన్ బి కూడా ఉందట. యూరప్ వెళ్లడం సాధ్యం కాకపోతే.. అలాంటి లొకేషన్లు ఎక్కడ ఉన్నాయో వెదికి.. అక్కడ షూటింగ్ చేస్తారు.