ఇదివరకు మల్టీస్టారర్ సినిమాలు చేయాలంటే హీరోలు ధైర్యం చేసేవారు కాదు. ఇమేజ్, ఫ్యాన్స్ అంటూ రకరకాలుగా ఆలోచించేవారు. ఇప్పుడు అలా లేదు. సోలో హీరో సినిమాలకంటే మల్టీస్టారర్లకే క్రేజ్ ఎక్కువ ఉంది. హీరోలూ… ఇలాంటి కథలు చేయడానికి రెడీగా ఉంటున్నారు. పైగా మల్టీస్టారర్ల వల్ల మార్కెట్ పెరుగుతోంది కూడా. అయితే ప్రభాస్ మాత్రం ఓ మల్టీస్టారర్ కథకు నో చెప్పినట్టు సమాచారం.
వివరాల్లోకి వెళ్తే… బాలీవుడ్ దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ తో ప్రభాస్ ఓ సినిమా చేయాలి. ఎప్పటి నుంచో ఈ ప్రాజెక్ట్ నలుగుతోంది. కానీ వీలు కావడం లేదు. మధ్యలో షారుఖ్‌తో ‘పఠాన్’ సినిమా తీసి సూపర్ హిట్టు కొట్టాడు సిద్దార్థ్. ఈ సినిమాతో షారుఖ్ కెరీర్‌కు పునః వైభవం వచ్చింది. బాలీవుడ్ కూడా ఈ హిట్ తో ఊపిరి పీల్చుకొంది. ‘పఠాన్’ తరవాత సిద్దార్థ్ తో కలిసి సినిమా చేయడానికి చాలామంది హీరోలు ముందుకు వచ్చారు. కానీ సిద్దార్థ్ మాత్రం తనకు ప్రభాస్ కావాలని పట్టుపట్టాడు. ప్రభాస్ కూడా సిద్దార్థ్ తో సినిమా చేయడానికి రెడీగానే ఉన్నాడు. అయితే ఈసారి సిద్దార్థ్ ఓ మల్టీస్టారర్ కథ రాసుకొచ్చాడు. ఓ హీరోగా షారుఖ్ ఫిక్స్. సౌత్ నుంచి మరో హీరో కావాలి. అది ప్రభాస్ అయితే బాగుంటుందన్నది సిద్దార్థ్ ఆలోచన. అయితే ప్రభాస్ మాత్రం ఈ మల్టీస్టారర్ కథకు నో చెప్పాడు. తనకు మల్టీస్టారర్లు చేయడం ఇష్టం లేదని, సోలో హీరోగా కథ చెబితే చేస్తానని చెప్పి పంపించేశాడని టాక్.
ఇప్పుడు సిద్దార్థ్ ఆనంద్ మరో హీరో కోసం అన్వేషణ మొదలు పెట్టాడు. ప్రభాస్‌కు తగిన కటౌట్ సిద్దార్థ్‌కు దొరకడం కష్టమే. అయితే ఆ క్యారెక్టర్ అయినా కాస్త మార్చాలి. లేదంటే… దొరికిన వాళ్లతో సర్దుకుపోవాలి.