హీరోయిజానికి చాలామంది చాలా అర్థాలు చెప్పారు. చెడుని ఎదిరించే వాడే హీరో అన్నది జగం ఎరిగిన నిర్వచనం. అయితే ఆ టైమింగ్ ని కాస్త మార్చి – హీరోయిజాన్ని ఎవరెస్ట్ పై కూర్చోబెట్టిన దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. ఆయన సినిమాల్లోనూ హీరో చెడుపైనే పోరాటం చేస్తాడు. కానీ.. కొంచెం సమయం తీసుకుంటాడు. అన్యాయాన్ని భరించీ, సహించీ.. విసిగి వేసారి.. `ఇక చాలూ…..` అంటూ ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చుతాడు. `హీరో విలన్ ని కొట్టి తీరాల్సిందే..` అని థియేటర్లో జనమే ఎదరు చూసేలా ఆడిటోరియాన్ని సిద్ధం చేస్తాడు. అప్పుడే హీరోయిజం పండుతుంది. `ఛత్రపతి`లో రాజమౌళి చూపించిందీ.. ప్రభాస్ చేసిందీ అదే.
పాటలు, ఫైట్లూ, సెంటిమెంట్, రొమాన్స్.. ఇలా అన్నీ మేళవించిన సినిమా `ఛత్రపతి`. మామూలుగా చూస్తే ఫక్తు కమర్షియల్ కథ. దాన్ని రాజమౌళి తనదైన టేకింగ్ తో.. ప్రత్యేకంగా నిలిపాడు. ప్రభాస్ లోని అసలైన మాస్ ని 70 ఎం.ఎంలో ఎలివేట్ చేసి – మాస్ ప్రేక్షకులకు మరింత దగ్గర చేశాడు. అందుకే అటు రాజమౌళి కెరీర్లోనూ, ఇటు ప్రభాస్ కెరీర్లోనూ.. `ఛత్రపతి` ఓ ప్రత్యేక చిత్రంగా మిగిలిపోయింది. ఈ సినిమా విడుదలై నేటికి పదిహేనేళ్లు.
గూజ్బమ్స్ మూమెంట్స్‌కి రాజమౌళి సినిమాల్లో కొదవ ఉండదు. ఈ సినిమాలో మాత్రం అలాంటి సన్నివేశాలు చాలా కనిపిస్తాయి. తొలిసారి ప్రభాస్ ప్రత్యర్థులపై విరుచుకుపడడం దగ్గర్నుంచి అసలైన ఆట మొదలవుతుంది. `ఒక్క అడుగు..`అంటూ విశాఖ మ్యాప్ పై కాలు మోపడం దగ్గర హీరోయిజం ఆకాశమంత ఎత్తుకు ఎదుగుతుంది. అక్కడి నుంచి… ఛత్రపతి వేసిన ప్రతి అడుగులోనూ.. మాస్ కి నచ్చే అంశాలు, ఫ్యాన్స్ ఖుషీ అయిపోయే విషయాలు కుప్పలు తెప్పలుగా ఉంటాయి. దానికి తోడు.. హుషారెత్తించే పాటలు. మధ్యమధ్యలో వేణుమాధవ్ కామెడీతో… కావల్సినంత రిలీఫ్ దొరుకుతుంది. ఫఫీలోని నటుడ్ని రాజమౌళి వాడుకున్నంతగా ఆ తరవాత మరెవరూ వాడుకోలేదు. భానుప్రియ విషయంలోనూ అదే జరిగింది. ఈ సినిమాతో భానుప్రియకు ఉత్తమ సహాయ నటిగా నంది పురస్కారం దక్కింది. అప్పట్లో కేవలం 8 కోట్లతో తెరకెక్కిన సినిమా ఇది. ఏకంగా 30 కోట్లు సాధించి ఆ యేడాది అత్యంత విజవంతమైన చిత్రాల జాబితాలో అగ్ర స్థానంలో కూర్చుంది.