ఆగస్టు 15న `సాహో` రావడం దాదాపు అసాధ్యమే. ఒకట్రెండు రోజుల్లో సాహో టీమ్ కొత్త రిలీజ్ డేట్ ప్రకటించబోతోంది. ఈలోగా… మిగిలిన సినిమాలు ఆగస్టు 15 బెర్తుని వాడుకోవాలని చూస్తున్నాయి. వాటిలో శర్వానంద్ సినిమా `రణరంగం` కూడా ఉంది. ఆగస్టులో ఈ సినిమాని విడుదల చేయాలని చిత్రబృందం ముందే ప్లాన్ చేసింది. కానీ ప్రభాస్ సినిమా ఉండడంతో.. ఆ ప్లాన్ పక్కన పెట్టింది. ఎప్పుడైతే.. ప్రభాస్ సినిమా వాయిదా పడే అవకాశాలున్నాయని తెలిసిందో అప్పుడే రణరంగం విడుదల తేదీ ప్రకటించేశారు. ఆగస్టు 15న ఈ సినిమాని విడుదల చేస్తున్నట్టు చిత్రబృందం ధృవీకరించింది. అడవి శేష్ సినిమా `ఎవడు` కూడా ఇప్పుడు రిలీజ్ డేట్ క్లియర్ చేసుకుంది. ఈ సినిమా కూడా ఆగస్టు 15నే రాబోతోంది. ఆగస్టు 30న సాహో వెళ్లిపోవడంతో… ఆ డేట్లో ముందే ఫిక్సయిన కొన్ని సినిమాలు ఇప్పుడు ఇబ్బందుల్ని ఎదుర్కుంటున్నాయి. ఆగస్టు 30 కంటే ముందే రావాలా? లేదంటే.. సాహో వెళ్లాక.. కాస్త ఆగి రావాలా?? అనే విషయంలో తర్జన భర్జనలు పడుతున్నాయి. మొత్తానికి సాహో విడుదల తేదీలో మార్పు, మిగిలిన సినిమాల్ని టెన్షన్ లో పడేసింది.