బాహుబలి తరవాత.. ప్రభాస్ ఇమేజ్ వంద రెట్లు పెరిగింది. ప్రభాస్ ఏం చేసినా, చేస్తున్నా ఇప్పుడు వార్తే! ఇప్పుడు అందరి దృష్టీ ‘సాహో’పై పడింది. ఈ సినిమా టీజర్.. సోషల్ మీడియాలో సంచలనాలు సృష్టించింది. వెండి తెరపై సాహోని ఎప్పుడెప్పుడు చూద్దామా అని చిత్రసీమ ఆత్రుతగా ఎదురుచూస్తోంది. ఈ అంచనాల్ని కనిపెట్టిన సాహో టీమ్.. ప్రతీ అడుగూ ఆచి తూచి వేస్తోంది. కథ విషయంలోనూ.. ఆఖరి నిమిషంలో మార్పులు, చేర్పులూ చేసినట్టు సమాచారం. ప్రభాస్ కోసం సుజిత్ ఎప్పుడో బౌండెడ్ స్క్రిప్టు తయారు చేసుకొని తన దగ్గర పెట్టుకొన్నాడు. కథ కూడా ప్రభాస్‌కి బాగా నచ్చేసింది. అయితే.. బాహుబలి వల్ల పెరిగిపోయిన ఇమేజ్‌ని దృష్టిలో ఉంచుకొని కథ, కథనాల్లో భారీ మార్పులు చేసినట్టు తెలుస్తోంది.
ఇటీవల ఓ ఆంగ్ల పత్రికకు ప్రభాస్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. అది చూస్తే…. `సాహో` కథ మారిందన్న విషయం చూచాయిగా అర్థం అవుతుంది. ”ముందు మేం సైన్స్ ఫిక్షన్ అనుకొన్నాం.. కానీ… ఇప్పుడు యాక్షన్ థ్రిల్లర్ సిద్దం చేశాం. యాక్షన్ ఘట్టాల రూపకల్పన కళ్లు చెదిరే రీతిలో ఉండబోతోంది” అంటూ సాహోకి సంబధించిన ఓ కీలకమైన క్లూ ఇచ్చాడు ప్రభాస్.