చిన్నా, పెద్దా అనే తేడా లేదు. హీరోలంతా ప్రమోషన్లతో హోరెత్తించడం చూస్తూనే ఉన్నాం. పాన్ ఇండియా సినిమా తీస్తే.. దేశమంతటా టూర్లేసి సినిమాకి హైప్ తీసుకుని రావడంలో హీరోలు తలమునకలైపోతున్నారు. అయితే.. ప్రభాస్ మాత్రం ఇందుకు విరుద్ధం. తన సినిమా అనగానే ప్రమోషన్ కార్యక్రమాల్ని `లైట్` తీసుకొంటున్నాడు ప్రభాస్. `సలార్`కీ అదే సమస్య. పాన్ ఇండియా స్థాయిలో, భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమా ఇది. ఈనెలలోనే విడుదల అవుతోంది. మరో రెండు వారాల గ్యాప్ కూడా లేదు. ప్రమోషన్లు ఇంకా మొదలవ్వలేదు. ఒక్క ట్రైలర్ వదిలారంతే. ఈ రెండు వారాల్లో ప్రమోషన్లు జరుగుతాయన్న గ్యారెంటీ కూడా లేదు. ఎందుకంటే.. ప్రభాస్ ప్రమోషన్లకు రావడానికి ససేమీరా అంటున్నాడని టాక్.
సాధారణంగా పెద్ద సినిమాలకు ప్రీ రిలీజ్ ఈవెంట్లు నిర్వహించడం పరిపాటి. సలార్‌కీ అలా ఏదో ఓ పెద్ద ఈవెంట్ ఉంటుందని భావించారంతా. కానీ.. ఈ సినిమాకి ప్రీ రిలీజ్ ఈవెంట్ లేదు. టీమ్ అంతా ఓ వీడియో ఇంటర్వ్యూ చేసి, దాన్నే అన్ని ఛానళ్లకూ ఇవ్వాలని టీమ్ నిర్ణయించింది. సలార్‌కి కావల్సినంత బజ్ ఉందని, ప్రత్యేకంగా ప్రమోషన్లు నిర్వహించాల్సిన అవసరం లేదని టీమ్ భావిస్తోంది. `ఆర్.ఆర్.ఆర్`కీ ఇంత కంటే పెద్ద బజ్జే వచ్చింది. కానీ.. రాజమౌళి సినిమాని అలా వదిలేయలేదు. ఇండియా అంతా తిరిగాడు. చరణ్, ఎన్టీఆర్‌ని వెంట బెట్టుకొని తిప్పాడు. `బాహుబలి` కోసం కూడా ప్రభాస్ అదే చేశాడు. కానీ ప్రశాంత్ నీల్ దగ్గరకు వచ్చేసరికి ప్రభాస్ లైట్ తీసుకొన్నాడు. ప్రభాస్ కి ఇటీవలే ఆపరేషన్ జరిగింది. దానికి తోడు మీడియా ముందు ప్రభాస్ కంఫర్ట్ గా ఉండలేడు. అందుకే ప్రమోషన్లకు ‘రాం.. రాం’ చెప్పేశాడని తెలుస్తోంది.