మంచు విష్ణు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం ‘కన్నప్ప’. ఈ సినిమాలో చాలామంది పేరున్న స్టార్స్ కనిపించబోతున్నారు. అందులో ప్రభాస్ ఒకడు. ఈ చిత్రంలో ఆయన నందీశ్వరుడిగా అవతారం ఎత్తబోతున్నారు. అక్షయ్ కుమార్ శివుడిగా దర్శనమివ్వబోతున్నారు. ఆయనకు సంబంధించిన షూటింగ్ పూర్తయ్యింది. రెండు వారాల పాటు రామోజీ ఫిల్మ్‌సిటీలో అక్షయ్ కుమార్ పై కొన్ని కీలకమైన సన్నివేశాల్ని తెరకెక్కించారు. ఈ షెడ్యూల్ తో షూటింగ్ వ్యవహారాలు ఓ కొలిక్కి వచ్చినట్టే. ఇప్పుడు ప్రభాస్ కూడా ఎంట్రీ ఇచ్చేస్తే ‘కన్నప్ప’ కథ సుఖాంతం అవుతుంది.
అందుకే విష్ణు అండ్ టీమ్… ప్రభాస్ గురించి నిరీక్షిస్తున్నారు. ప్రభాస్ డేట్లు ఇస్తే ‘కన్నప్ప’ పూర్తవుతుంది. అయితే డేట్ల విషయంలో ప్రభాస్ పై విష్ణు ఒత్తిడి తీసుకురాలేకపోతున్నాడు. ప్రభాస్ ఎప్పుడంటే అప్పుడు షూటింగ్ పెట్టుకోవడం మినహా విష్ణు చేసేదేం లేదు. అయితే ప్రభాస్ ఇప్పుడు ఫుల్ బిజీ. ఓవైపు ‘కల్కి’, మరోవైపు ‘రాజాసాబ్’ ఉన్నాయి. ‘సలార్ 2’ ప్యాచ్ వర్క్ కూడా బాకీ ఉంది. వీటి మధ్య `కన్నప్ప`కు డేట్లు ఇవ్వాలి. దాంతో పాటు మిగిలిన కో ఆర్టిస్టుల డేట్లు కూడా సర్దుబాటు కావాల్సివుంది. ఇదే విష్ణు ముందున్న కఠినమైన టాస్క్. ప్రభాస్ వారం రోజులు కేటాయిస్తే చాలు. ‘కన్నప్ప’ రెడీ అయిపోతుంది. అదెప్పుడన్నదే కీలకం. మరోవైపు ‘కన్నప్ప’ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా నిర్విరామంగా సాగుతున్నాయి. అతి తొందర్లో ‘కన్నప్ప’ టీజర్ రెడీ చేసే పనిలో ఉంది చిత్రబృందం.