ఇప్పటి సినిమా స్టార్ కనుసన్నల్లోనే నడుస్తోంది. టాప్ స్టార్ తో సినిమా అంటే… అన్నీ ఆయన ఇష్టప్రకారమే జరగాలి. దర్శకుడు విజన్ ఏదైనా సరే, అది హీరో గారి అభిరుచితో మ్యాచ్ అవ్వాలి. నటీనటుల దగ్గర్నుంచి, సాంకేతిన నిపుణుల వరకూ.. ఎవరి ఎంపిక అయినా సరే, అది హీరో పర్మిషన్ తోనే జరగాలి. తన అభిమానులకు ఏం కావాలో? తన నుంచి అభిమానులు ఏం ఆశిస్తారో, తను ఎలా ఉంటో అభిమానులకు నచ్చుతుందో హీరోకే బాగా తెలుసు కాబట్టి, దర్శకులు కూడా ఫస్ట్ ఛాయిస్ వాళ్లకే ఇస్తున్నారు.
కానీ..ప్రభాస్ దగ్గర ఈ సీన్ రివర్స్. మొహమాటమో, మంచి తనమో తెలీదు గానీ, ప్రభాస్ తన సినిమాకి సంబంధించిన ఏ విషయంలోనూ దర్శకుడిపై ఒత్తిడి తీసుకురావడం లేదట. `ఆదిపురుష్` విషయంలోనూ ప్రస్తుతం ఇదే జరుగుతోందని ఇన్సైడ్ వర్గాల టాక్. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న చిత్రం `ఆదిపురుష్`. ఓం రౌత్ దర్శకుడు. ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా సైఫ్ అలీఖాన్ ని ఎంచుకున్న సంగతి తెలిసిందే. ఆది పురుష్ అనే టైటిల్ విషయంలో గానీ, విలన్ ఎంపిక విషయంలో గానీ, ప్రభాస్ ఏమాత్రం జోక్యం చేసుకోలేదని తెలుస్తోంది. దర్శకుడు ఎంపిక చేసిన తరవాతే.. ఆ విషయం ప్రభాస్ కి తెలిసిందట. ప్రభాస్ ని ఢీ కొట్టే శక్తి… సైఫ్‌కి ఉందా, ప్రభాస్ ముందు సైఫ్ కనిపిస్తాడా? అసలు ప్రభాస్ ఇమేజ్‌కీ సైఫ్ ఇమేజ్‌కీ పోలిక ఉందా? అంటూ ప్రభాస్ అభిమానులే… అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ… ఓం రౌత్ తనకి అత్యంత సన్నిహితుడైన సైఫ్‌ని, ప్రభాస్ అనుమతి లేకుండానే టీమ్ లోకి తీసుకొచ్చేశాడు.
ముంబైలో ఓం.. తనకు కావల్సిన టీమ్ ని ఏర్పాటు చేసుకునే పనిలో నిమగ్నమైపోయాడు. ఆ విషయంలో.. ప్రభాస్ ఏమాత్రం కలగజేసుకోవడం లేదని, దర్శకుడికి పూర్తిగా ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశాడని తెలుస్తోంది. దర్శకుడి విజన్ కి కట్టుబడి నడుచుకోవడం మంచిదే.కాకపోతే.. అన్ని విషయాల్లోనూ అదే సూత్రం పనిచేయదు కూడా. బాహుబలితో ప్రభాస్ ఇమేజ్ మారింది. మార్కెట్ మారింది. ప్రభాస్ సినిమా అంటే వందల కోట్ల ప్రాజెక్టు. ఎంత పాన్ ఇండియా స్టార్ అయినా ఆ సినిమా తెలుగు వాళ్ల అభిరుచికి తగ్గట్టుగా తీర్చిదిద్దడం కీలకం. ఇక్కడ జనాల మాస్ పల్స్ ఓం రౌత్ కంటే ప్రభాస్ కి బాగా తెలుసు. అన్ని విషయాల్లోనూ దర్శకుడికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వకుండా – కొన్ని విషయాల్లో అయినా ప్రభాస్ పట్టించుకుంటే బాగుంటుందని ప్రభాస్ అభిమానులే కాదు, సన్నిహితులూ ఆశ పడుతున్నారు.