ఆదిపురుష్ ప్రచార పర్వం.. అయోధ్యలో మొదలైంది. ఈరోజు అయోధ్యలో ఆదిపురుష్ టీజర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ ”ఆది పురుష్ ప్రమోషన్ల కోసం అయోధ్య వచ్చాం. మాకు శ్రీరాముడి ఆశీర్వాదాలు కావాలి. ప్రేమ, భయం, గౌరవంతో ఈ సినిమా చేశాం. మిగిలిందంతా.. రాముడి కృప. రాముడి నుంచి క్రమశిక్షణ, అంకితభావం నేర్చుకోవడానికి శతాబ్దాలుగా మనమంతా ప్రయత్నిస్తూనే ఉన్నాం. కానీ రాముడిలా బతకడం సాధ్యం కాదు. కనుకే ఆయన దేవుడయ్యాడు. మనం మనుషులుగా మిగిలిపోయాం” అన్నాడు. సీత పాత్ర పోషించిన కృతి మాట్లాడుతూ “నేను ఎంతో అదృష్టవంతురాల్ని. చాలా తక్కువమందికే ఇలాంటి సినిమాల్లో నటించే అవకాశం వస్తుంది. నాకు ఆ అవకాశం చాలా త్వరగా వచ్చిందనిపిస్తోంది. మర్చిపోలేని పాత్ర ఇది. షూటింగ్ చివరి రోజు.. చాలా ఎమోషన్ అయిపోయాను. సెట్ వదిలి వెళ్లడానిక మనసు రాలేదు. ఓ కలలాంటి సినిమా ఇది. రామాయణం మనం విన్నాం. చూశాం. చిన్నప్పుడు టీవీల్లో రామాయణం చూశాను. తాతమ్మ, నాయినమ్మలు కథలు కథలుగా చెప్పారు. కానీ.. విజువల్ గా చూసినప్పుడు ఆ కథలు మరింతగా గుర్తుండిపోతాయి. ‘ఆదిపురుష్’ని పిల్లలూ, పెద్దలూ అంతా చూడాలి. ఎందుకంటే.. రామాయణం లాంటి ఇతిహాసాన్ని మనమంతా.. మర్చిపోకూడదు. వెండి తెరపై ఈ గాథ మరింత గొప్పగా ఉంటుంది“ అని చెప్పుకొచ్చింది. టీ సిరీస్ అధినేత భూషణ్ మాట్లాడుతూ “ఈ సినిమా మా నాన్నగారి కల.. ఆయన కోసమే ఈ సినిమా తీశాం. రాముడి కథని సినిమాగా తీద్దామని దర్శకుడు చెప్పినప్పుడు క్షణం కూడా ఆలోచించలేదు. ప్రభాస్ తో మళ్లీ మళ్లీ సినిమాలు తీస్తూనే ఉంటాం” అన్నారు.