ప్రభాస్ చేతిలో చాలా ప్రాజెక్ట్‌లు ఉన్నాయిప్పుడు. కల్కి, సలార్ 2తో పాటుగా రాజాసాబ్ కి కూడా వరుసగా డేట్లు ఇస్తున్నాడు ప్రభాస్. వీటిలో కల్కి తన తొలి ప్రాధాన్యత. ఆ తరవాత సలార్ 2, రాజా సాబ్. ఈ సినిమాల విడుదల మధ్య కూడా గ్యాప్ ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు ప్రభాస్. నిజానికి రాజా సాబ్ ఈ యేడాదే రావాలి. కానీ.. సలార్ 2 వల్ల రాజా సాబ్ ఆలస్యం అవుతోంది. సలార్ 2 కంటే రాజా సాబ్ ముందు విడుదలయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
2025 సంక్రాంతికి ‘రాజాసాబ్’ ని విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేసుకొంటున్నారని టాక్. సంక్రాంతి బరిలో ప్రభాస్ సినిమా నిలిస్తే… ఆ కళే వేరుగా ఉంటుంది. పైగా ‘రాజా సాబ్’ పండక్కి తగ్గట్టుగానే మారుతి కలర్‌ఫుల్ గా డిజైన్ చేస్తున్నాడు. ఇటీవల సంక్రాంతికి విడుదలైన ఫస్ట్ లుక్‌లో ప్రభాస్ వింటేజ్ అవతార్‌లో కనిపించాడు. మాస్ గా లుంగీ కట్టుకొని ఫ్యాన్స్ ని మరోసారి ఫిదా చేసేశాడు. ‘రాజాసాబ్’ పండక్కి సరైన సినిమా అని మారుతి భావిస్తున్నట్టు టాక్. సంక్రాంతి బరిలో ప్రభాస్ సినిమా నిలిచి కూడా చాలాకాలం అయ్యింది. అందుకే రాజా సాబ్ ని పండక్కే దింపాలని చూస్తోంది టీమ్. ఇప్పటికే చిరంజీవి, నాగచైతన్య, శర్వానంద్ చిత్రాలు 2025 సంక్రాంతికి వస్తున్నామంటూ ప్రకటించుకొన్నాయి. ఇప్పుడు ప్రభాస్ సినిమా కూడా చేరిపోయినట్టే.