ఎన్నాళ్ల నుంచో.. ప్రభాస్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం `ఆది పురుష్`. ఈ సినిమా అప్ డేట్ల కోసం కరువు కాచిపోయారు ఫ్యాన్స్. ఇప్పుడు వాళ్లందరి కడుపు నిండేలా – ఆదిపురుష్ చిత్రం నుంచి అప్డేట్లు వస్తూనే ఉన్నాయి. రెండ్రోజుల క్రితం ఫస్ట్ లుక్ విడుదల చేసింది చిత్ర బృందం. ఇప్పుడు టీజర్ వచ్చేసింది.
రామాయణ ఇతిహాస నేపథ్యంగా ఈ చిత్రాన్ని రూపొందించామని చిత్ర బృందం ముందే చెప్పింది. రాముడిగా ప్రభాస్, రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్, సీతగా… కృతిసనన్ నటించిన చిత్రమిది. ఆ పాత్రల్ని, రామాయణంలోని కీలక ఘట్టాల్ని ఆవిష్కరిస్తూ టీజర్‌ని రూపొందించారు. టీజర్ అంతా విజువల్ ఎఫెక్ట్సే. రాముడిగా ప్రభాస్ ఆహార్యం అద్భుతంగా కుదిరింది.
న్యాయం చేతుల్లోనే అన్యాయానికి సర్వ నాశనం
వస్తున్నా.. న్యాయం రెండు పాదాలతో పది తలల నీ అన్యాయాన్ని అణచి వేయడానికి..
నా ఆగమనం.. అధర్మ విధ్వంసం.. – ప్రభాస్ నుంచి వినిపించిన డైలాగులు ఇవి.
గాల్లో బాణాల వర్షం, వానరుల యుద్ధం, పది తలల రావణాసురిడి విన్యాసం, సముద్రంలోంచి పుట్టుకొచ్చిన ఆకారం, చివర్లో జై శ్రీరామ్ మంత్రం.. ఇలా ఏ ఫ్రేమ్ చూసినా విజువల్ ఎఫెక్ట్సే కనిపిస్తున్నాయి. ఈ సినిమా దాదాపుగా బ్లూ మేట్ లో తీశారు. సెట్స్ వేసింది చాలా తక్కువ. ఆ విషయం టీజర్ చూస్తే అర్థమైపోతోంది. 2023లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని చిత్ర బృందం తెలిసింది. సంక్రాంతికి ఈ చిత్రం సిద్ధం కావొచ్చు.