పిరియాడికల్ సినిమాల హవా మళ్లీ మొదలైంది. గౌతమిపుత్ర శాతకర్ణి అలాంటి కథే. చిరంజీవి 151వ చిత్రం `సైరా` కోసం కూడా చరిత్ర పుటల్లోకి వెళ్లాల్సివస్తోంది. రామ్ చరణ్ రంగ స్థలం 1985 నేపథ్యంలో సాగే కథ. ఇప్పుడు ప్రభాస్ కూడా 1985.. ఆ కాలంలోకి వెళ్లబోతున్నాడు. ప్రభాస్ ప్రస్తుతం సాహో తో బిజీగా ఉన్నాడు. ఆ తరవాత జిల్ దర్శకుడు రాధాకృష్ణ తో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే స్క్రిప్టు సిద్ధమైంది. 2018 వేసవిలో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లబోతోంది. ఇది కూడా పిరియాడిల్ సినిమా అని సమాచారం. 1985 నేపథ్యంలో సాగుతుందట. సెట్స్‌కి సంబంధించిన పనులకు ఎక్కువ సమయం తీసుకోవాల్సివస్తుందట. అందుకే 2018 ప్రారంభం నుంచే.. సెట్స్‌ని రూపొందించే పని మొదలెడతారని తెలుస్తుంది. ఈ చిత్రానికి రవీందర్ కళా దర్శకత్వం వహించనున్నారు. మగధీర, ఈగ, మర్యాద రామన్న సినిమాలకు గానూ.. రవిందర్ వేసిన సెట్లకు మంచి గుర్తింపు వచ్చింది. సగం సినిమా సెట్స్‌లో, సగం సినిమా… విదేశాల్లో తెరకెక్కిస్తారని, ఫారెన్ లొకేషన్ల పై ఇప్పటికే చిత్రబృందం ఓ అవగాహనకు వచ్చిందని తెలుస్తోంది. యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. హస్త సాముద్రికం నేపథ్యంలో సాగే కథ అని సమాచారం. జాతకం, జ్యోతిష్యం… వీటి నేపథ్యంలో నడుస్తుందట. సాహో కనుక బాలీవుడ్లో విజయఢంకా మోగిస్తే.. ఈ చిత్రాన్నీ.. హిందీలో భారీ ఎత్తున విడుదల చేసే అవకాశాలున్నాయి.